చనిపోయిన స్నేహితుడి కూతురు పెళ్ళికి స్నేహితుల సహాయం

చనిపోయిన స్నేహితుడి కూతురు పెళ్ళికి స్నేహితుల సహాయం
  • క్లాస్మెట్స్ పెద్దమనసు
  • తల్లిదండ్రులు కోల్పోయిన ఆడబిడ్డ పెళ్ళికి చేయుత నందించిన దోస్తులు

ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్ననాటి మిత్రుడు, క్లాస్మెట్ చనిపోయినప్పటికీ... వారు మిత్రత్వాన్ని మరిచిపోలేదు... ఎప్పుడో 28 ఏళ్ల క్రితం చదువుకున్న స్నేహితుడి కూతురు పెళ్లికి చేయూతనందించి  పెద్దమనుసు చాటుకుని దోస్తులమనిపించుకున్నారు. గురువారం పెళ్లి జరగ్గా దోస్తులు తమ వంతు సహకారం అందించారు. వివరాలిలా ఉన్నాయి...మెదక్ మండలం మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995లో 10వ తరగతి బ్యాచ్ చెందిన విద్యార్థుల్లో ర్యాలమడుగు చెందిన ఉడుగుల ఏసుపాల్ ఒకరు. అనంతరం ఏసుపాల్ పద్మను వివాహమాడాడు. వీరికి కుమారుడు, కుమార్తె జన్మించారు.  అనారోగ్యంతో పద్మ చనిపోగా తీవ్ర మానసిక వేదనకు గురైన ఏసుపాల్ 15 సంవత్సరాల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను నానమ్మ సత్యమ్మ ర్యాలమడుగులో పెంచి పెద్ద చేసింది. మనుమరాలు నందినికి పెళ్ళీడు రావడంతో కొల్చారంకు చెందిన ఫోటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ తో పెళ్లి నిశ్చయించారు. గురువారం మెదక్లో పెళ్లి జరిగింది. యేసుపాల్ క్లాస్మేట్స్ రవి, విట్టల్, ఆనంద్ కుమార్, బ్రహ్మచారి, ఆకుల నర్సింలు, విద్యాసాగర్, నరసింగరావు, రఘు, ఆంజనేయులు తదితరులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. పెళ్లి విషయం తెలుసుకున్న ఏసుపాల్ క్లాస్మేట్స్ తమ వంతు సహకారం చేయడానికి ముందుకు వచ్చారు. ఫర్నిచర్ తో పాటు సుమారు 50 వేల రూపాయల ఆర్థిక సహకారం అందజేసీ తమ ఔదార్యాన్ని చాటి చెప్పారు.