కురవి ఎంపిపికి ఎంత కష్టం..

కురవి ఎంపిపికి ఎంత కష్టం..
Kuravi MPP padmavathi
  • ఉదయం యంపిపి గా అభివృద్ధి కార్యక్రమాలలో..
  • మద్యాహ్నం నుండి తాలుమిరపకాయలు ఏరే కూలీగా బతుకుపోరులో..!!
  • సియం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆత్మీయతతో స్పందించాలి..!! 

ముద్ర ప్రతినిధి‌, మహబూబాబాద్:(సిహెచ్ శ్రీనివాస్., మహబూబాబాద్): ఆయన ఓ.. తెలంగాణ ఉద్యమకారుడు.. టిఆర్ఎస్ ఆవిర్బావం నుండి అదే పార్టీలో కొనసాగిన క్రియాశీల కార్యకర్త.. డోర్నకల్ నియోజకవర్గంలో తెరాసపార్టీ అతిపలచగా ఉన్న రోజుల్లోనే గులాబీజెండాను భుజానపెట్టుకొని పట్టుదలగా పనిచేసిన విద్యార్ధినాయకుడు.. తెలంగాణ ఏర్పాటు మారినరాజకీయపరిణామాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరునిగా గుర్తింపు సాదించారు. రెడ్యానాయక్ ఆశీస్సులతో నేరడ యంపిటిసిగా ఆయన సతీమణిని టిఆర్ఎస్ తరుపున బరిలో దింపాడు. యంపిటిసి గా విజయంసాదించి ఎమ్మెల్యే రెడ్యానాయక్ దీవెనతో కురవి మండల యంపిపిగా నియామకం అయ్యారు. ఇంతవరకు అంతా బాగానే కనిపించిన ఆ..ఉద్యమకారుని అసలు కష్టాలు అక్కడే ప్రారంభం అయ్యాయి..  కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన గుగులోత్ రవి తెలంగాణ సాదన ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన సతీమణి గుగులోత్ పద్మావతిరవినాయక్ కురవి యంపిపిగా కొనసాగుతున్నారు. 

 యంపిపి పదవి దక్కినా పాయిదా లేదు..!! 

డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ ఆశీస్సులతో రవి తన సతీమణి పద్మావతిని నేరడ యంపిటిసిగా టిఆర్ఎస్ తరుపున ఎన్నికల బరిలోకి దింపారు. దిగువ మద్యతరగతి గిరిజనకుటుంబానికి చెందిన రవి ఎన్నికలకోసం చేతిలో ఉన్న డబ్బుతోపాటు అప్పుచేసి ఖర్చు పెట్టాడు. యంపిటిసిగా గెలిచిన అనంతరం యంపిపి కోసం మరింత పెద్దమొత్తం పెట్టాల్సి రావడంతో అప్పులు బారీగానే చేసాడు. తనకు ఉన్న ఎకరం పదిగుంటల భూమిలో ఎకరం భూమి అప్పులకిందే అమ్ముడుపోయింది. ఇప్పుడు పదిగుంటలభూమి.., లక్షల్లో అప్పు భారంగా మిగిలిపోయింది. జీవితం గడవడమే దినదినగండంగా మారిపోయింది.
యంపిపి పదవిలో ఉన్నందుకు పర్యటనలు తప్పడంలేదు. అధికారిక కార్యక్రమాలకు క్రమంతప్పక హాజరవాల్సి వస్తుంది. ఎంతకష్టంలో ఉన్నా నవ్వుతూ కనిపించాల్సివస్తుంది. కానీ బ్రతుకుబండి లాగేందుకు  కూలీనాలీపనులకు యంపిపి పద్మావతి అందరితో పాటుగా వెల్లక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంత కష్టంలోనూ ఆ..దంపతులది మాత్రం మచ్చలేని నిజాయితి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై ఏ..మాత్రం తగ్గని నిలువెత్తు భక్తి అని చెప్పక తప్పదు.

శనివారం ఉదయం యంపిపి పద్మావతి ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి కురవిలో మహిళాసమైఖ్యభవనం ప్రారంబోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యగారిపల్లిలో జరిగిన భారాస ఆత్మీయసమ్మేళన సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. అక్కడ నుండి మద్యాహ్నం ఇంటికి వెల్లి బోజనం చేసి తాలుమెరపకాయలు ఏరడానికి రైతుల వద్దకు కూలీకి వెల్లారు. ఆర్ధికబారం కురవి యంపిపి గుగులోత్ పద్మావతిరవినాయక్ జీవితంలో ఇలాంటి పరిస్థితిని సృష్టించింది. యంపిపి గా ప్రజలకోసం పెదవులపై నవ్వులు.., గుండెలనిండా బాదలతో ఆ..కుటుంబం సతమతం అవుతుంది. తెలంగాణ సాదన ఉద్యమప్రారంభం నుంచి నేటిదాకా గులాబీజెండాను గుండెల్లో పాతుకున్న ఈ.. కుటుంబానికి గుప్పెడు దైర్యం కావాలి.. ఆర్ధిక కష్టాలు తీరిపోయే సాయం అందాల్సి ఉంది.

పార్టీ కోసం పనిచేసే ప్రతికార్యకర్తను పార్టీ ఆదుకుంటుందని, అండగా ఉంటుందనే సందేశాన్ని ఆత్మీయసమ్మేళనం ద్వారా అందించేందుకు భారాస పూనుకున్న ఈ.. సమయంలో ఓ..యంపిపిగా ఉండి దినసరికూలీగా పనులు చేసుకుంటున్న ఈ..గిరిజన కుటుంబానికి భారాస అదిష్టానం భరోసా ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో, మంత్రి, పార్టీవర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో కలిసి నడిచిన తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్వీ జిల్లాఅద్యక్షులు గుగులోత్ రవి, కురవి యంపిపి పద్మావతిరవినాయక్ దంపతులకు ఆత్మీయ ఓదార్పు, ఆర్థికభరోసా భారాస నుండి అందాలని, అదిష్టానం స్పందించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.