మానసిక ఆరోగ్యానికి మాటే మంత్రం

మానసిక ఆరోగ్యానికి మాటే మంత్రం

మానసిక వైద్య నిపుణులు డాక్టర్.జి.మహేంద్ర కుమార్ రెడ్డి 

మానసిక ఆరోగ్యానికి మాటే మంత్రమని మానసిక వైద్య నిపుణులు డాక్టర్.జి.మహేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి 5 మంది పిల్లలలో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్య ఉందని తెలిపారు. డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ , నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం బాలల సేవా విభాగంలో ఆదివారం మానసిక సమస్యలపై అవగాహన  నిర్వహించారు. మానసిక సమస్యలపై చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన వారికి లయన్ 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ జి.మహేంద్ర కుమార్, స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ జే.టి.విద్యా సాగర్, జోనల్ చైర్ పర్సన్ లయన్ సి.హెచ్. గోపాలకృష్ణ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్ అధ్యక్షుడు లయన్ బెల్లంకొండ వినయ్, డా.పి.స్వరుపా రాణి, లయన్ జి.కృష్ణవేణి,  లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్ బహుమతులు, పుస్తకాలు,  సర్టిఫికెట్లు అందజేసారు.  

మానసిక సమస్యలపై అవగాహన చాలా ముఖ్యమని తెలిపారు . ప్రీస్కూల్ , పాఠశాల వాతావరణంలోనే మెజారిటీ ప్రవర్తన రుగ్మతలను నివారించడం సాధ్యమవు తుందన్నారు. పిల్లలు ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన ఆస్తి అని అన్నారు. వారి పోషణ, ఒంటరితనం మన బాధ్యతని గుర్తు చేశారు.  అప్పుడే మన పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారన్నారు.  తీవ్రమైన మానసిక ఆరోగ్య రుగ్మతతో 20 మిలియన్ల మంది కౌమారదశలో ఉన్నారన్నారు. మానసిక ఆరోగ్య రుగ్మత ఉన్న 90% మంది పిల్లలు ప్రస్తుతం ఎటువంటి నిపుణుల సేవలను పొందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

 పిల్లల అభివృద్ధి, మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అన్ని అంశాలు భారతదేశంలో గమనించని స్థితిలో ఉన్నాయని బాధని వ్యక్తం చేశారు. మానవ వనరుల అభివృద్ధితో పాటు అవసరమైన ఆరోగ్యం ,పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, గృహ హింస ప్రభావాలను తగ్గించడానికి మన వంతు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.