ప్యానల్ న్యాయవాదులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి

ప్యానల్ న్యాయవాదులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి : న్యాయ సేవ సంస్థకు అనుబందంగా న్యాయ సేవలు అందించటానికి ఏర్పాటు చేయబడిన ప్యానల్ న్యాయవాదులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. దశరథ రామయ్య అన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా భువనగిరి, రామన్నపేట్, ఆలేరు, చౌటుప్పల్ న్యాయ సేవ సంస్థకు అనుబందంగా న్యాయ సేవలు అందించటానికి ఏర్పాటైన ప్యానల్ న్యాయవాదులు, రిటైనర్ న్యాయవాదులు, జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులలో ఉన్న న్యాయ సహాయ న్యాయవాదులకు, వ్యవసాయ న్యాయ సహాయ శిభిరంలలో సేవలు నిర్వర్తిస్తున్న పారా లీగల్ వాలంటీర్లకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సహాయ న్యాయవాదులను వారు అందిస్తున్న న్యాయ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన సేవలు అందించటానికి తగిన సూచనలు చేస్తూ, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగం పొందుపరిచిన ఆర్టికల్ 39ఎ ప్రకారం న్యాయ సహాయం అర్హులైనవారికి అందించటానికి న్యాయ సేవ అధికార సంస్థ చట్టం ఏర్పాటు అయ్యిందని, క్రిమినల్ లేదా సివిల్ కేసులలో అర్హులైన వారికి న్యాయ సేవలు అందించటం న్యాయ సేవ సంస్థలపై బాధ్యత ఉందని, ఇట్టి సేవలు మెరుగుగా అందించటానికి ప్యానల్ న్యాయవాదుల పాత్ర ఎంతో ప్రధానమైనదన్నారు. ప్యానల్ న్యాయవాదులు పూర్తి అంకితభావంతో వారి విధులను నిర్వర్తించాలని, జాతీయ న్యాయ సేవ సంస్థ రూపొందించిన న్యాయ సేవల పథకాలు పటిష్టంగా అమలు పరుచుటలో న్యాయ సేవ సంస్థలకు పూర్తి సహకారం అందించాలన్నారు.

ఫ్రంట్ ఆఫీసులలో న్యాయ సలహా న్యాయవాదులు ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయ సలహాలు, సేవలు అందించాలని కోరారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానం నూతనంగా వచ్చిన జిల్లా జడ్జి జయరాజుని ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగారం అంజయ్య, చింతల రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తడక మోహన్, భువనగిరి బారసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోదావెంకటేశ్వర్లు, బర్ల డేవిడ్, జెల్లా రమేష్, స్వాతి, బాలగోని రాజశేఖర్, స్వామి శ్రీశైలం సత్తయ్య, జంగయ్య, కిరణ్ ,చింతల రాజు పాల్గొన్నారు.