మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన...

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన...
  • మావోల కదలికలపై ఆరా...
  • పెర్రీ పాయింట్ల పరిశీలన..  

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: గోదావరి పరివాహక ప్రాంతం అయిన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్  సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలిమెల పోలీస్ స్టేషన్ ను ఆకస్మింగా తనిఖీ చేశారు. పోలీసు  సిబ్బంది చేస్తున్నటువంటి విధులను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి తీరప్రాంత గ్రామాల నుండి మావోయిస్టులు దాటడానికి అవకాశం ఉందని పరిస్థితుకనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మావోలకు అనుకూలంగా ఉన్న గోదావరి ఫెర్రీ  పాయింట్లయిన  సర్వాయిపేట, దమ్మూరు, బూరుగు గూడెం, నీలంపల్లి, బండారిగూడెం, ముకునూర్ వంటి గ్రామాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి, చేపలు పట్టే వారు, పడవలు నడిపే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యువత మావోయిస్టుల ప్రలోభాలకు గురి కావద్దని, వారికి సహకరించవద్దని ఎస్పీ కోరారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరిచుకోవాలని  సూచించారు. మావోయిస్టుల కార్యకలాపాలకు యువత ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని అన్నారు.  ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని, మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏ.ఆర్) వి. శ్రీనివాస్,  కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, మహదేవ్ పూర్ సీఐ కిరణ్,  పలిమెల ఎస్సై తమాషా రెడ్డి పాల్గొన్నారు.