జనసంద్రంగా సాగిన శ్రీరాముని శోభాయాత్ర

జనసంద్రంగా సాగిన శ్రీరాముని శోభాయాత్ర

జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన నిర్మల్ వీధులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీరామచంద్రుని జన్మదినం శ్రీ రామ నవమి సందర్భంగా నిర్మల్ పట్టణంలో వేలాది భక్తుల ' జై శ్రీరామ్ ' నినాదాల మధ్య శ్రీ రామ నవమి శోభాయాత్ర గురువారం నిర్వహించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ శోభా యాత్ర స్థానిక శ్రీ దేవరకోట వద్ద హిందూవాహిని సభ్యుల పూజా కార్యక్రమాల అనంతరం  ప్రారంభమైంది. హనుమాన్ మాలధారణ చేసిన భక్తులు కాషాయ దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ద్యాగవాడ, బాగులవాడ, చింతకుంట వాడ, డాక్టర్స్ లేన్, బుధవార్ పేట, గాంధీ చౌక్ ల మీదుగా కొనసాగింది. రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డి ఎస్పీ జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం పలు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉచితంగా  మంచి నీటి ప్యాకెట్ల పంపిణీ నిర్వహించారు.

పలుచోట్ల శ్రీ రామ నవమి వేడుకలు
శ్రీ రామ నవమి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని శాంతి నగర్, బాగులవాడ రామాలయాలలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శాంతి నగర్ లో ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.