మెట్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల జోరు..

మెట్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల జోరు..
  • ప్రభుత్వ ఆదాయానికి గండి...
  • పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు

మెట్‌పల్లి ముద్ర 

మెట్‌పల్లి మున్సిపాలిటీలో 'తాము గీసిందే గీత.. రాసిందే రాత' అనే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి మున్సిపల్ అధికారులపై ఉన్నతాధికారుల ఆజామాయిసి లేకపోవడం తో పట్టణంలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధిలో మున్సిపాలిటీ దూసుకుపోతున్నా అక్రమ నిర్మాణాల పీడ మాత్రం వీడడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ కట్టడాలకు ప్రజాప్రతినిధులే అండగా నిలవడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇష్ట రీతిగా నిర్మాణాలు... 

పట్టణంలోని 7వ వార్డు, పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతే ఉండడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న పట్టణంలో శివారు ప్రాంతమైన హనుమాన్ నగర్, ఇస్లాం పుర తో పాటు ఆరపేట ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో మున్సిపాలిటీ మీద అక్రమ నిర్మాణాల నీడ పడింది. దీనికి అడ్డు చెప్పాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాదారులు రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తీసుకున్న అనుమతులకు, చేపట్టే నిర్మాణాలకు పొంతన కుదురడం లేదు. బహుళ అంతస్తులు, సెల్లార్ల నిర్మాణం, సెట్ బ్యాక్ లు లేకపోవడం ఇలాంటి ఎన్నో అవకతవకలు ఆయా నిర్మాణాల్లో కనిపిస్తున్నాయి. పైగా ఈ వార్డులో కౌన్సిలర్ కు ముడుపులు చెల్లిస్తూ ఇష్ట రీతిగా నిర్మాణాలు చేపడుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. 

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..

ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టి ఎస్ బీ పాస్ ను ప్రవేశ పెట్టింది. టి ఎస్ బీ పాస్ ప్రకారం నూతన కట్టడాల నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు అన్ని విధాలుగా పరిశీలించి పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది కానీ ఇక్కడి అధికారులు ఎటువంటి పరిశీలన చేయకుండానే అనుమతులు ఇస్తున్నారు. ఎక్కడ నూతన నిర్మాణం చేపట్టిన ఆ నిర్మాణం నిబంధనల ప్రకారం ఉన్నదా లేదా అని పరిశీలించి చర్యలు తీసుకోవాలి.కానీ మెట్‌పల్లి   మున్సిపాలిటీలో మాత్రం అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నా వాటి వంక చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కానరాని టౌన్ ప్లానింగ్ అధికారులు..

మెట్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా కమిషనర్ ఆధీనంలో ఉండే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం అనేక సందేహాలకు ఊతమిస్తుంది. సామాన్యుల వద్ద ముక్కు పిండి పన్నులు వసూలు చేసే అధికారులు అక్రమ నిర్మాణాలను ఉపేక్షించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నా  టిపిఎస్ వేములవాడ మున్సిపల్ కు బదిలీపై వెళ్లగా, టిపిఓ  మూడు రోజులు ఇక్కడి మున్సిపల్ లో మరో మూడు రోజులు వేరే చోట విధులు నిర్వహిస్తాడు. టిపిఓ విధులకు హాజరైన మూడు రోజులు అక్రమ నిర్మాణాలపై ఎవరు పిర్యాదు చేసిన తనకు తెలువదు అని కమిషనర్ అడగాలని సమాధానం చెబుతాడని ప్రజలు చర్చించుకుంటున్నారు.అసలు పట్టణ మున్సిపల్ లో టౌన్ ప్లానింగ్ విభాగం ఉందా లేదా అనే సందేహం కలిగేలా ఆ విభాగం పని తీరు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.