కేసీఆర్‌‌ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిండు

కేసీఆర్‌‌ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిండు
  • నేను సీఎం అయితే నెలలో లక్ష ఉద్యోగాలిస్తా
  • వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేస్తా
  • షర్మిల పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌ ఇస్తా
  • ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ.పాల్‌
  • జనగామలో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, జనగామ : దనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌‌ అప్పులపాలు చేశాడని, ప్రస్తుతంలో రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల అప్పు ఉందని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఎ.పాల్‌ ఆరోపించారు. అప్పుల నుంచి తెలంగాణ విముక్తి కావాలంటే ప్రజాశాంతి పార్టీని ఎన్నుకోవాలన్నారు. సోమవారం జనగామలో పర్యటించిన కేఎ.పాల్‌ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం 1,569 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్‌, కేటీఆర్ కలవలేదని గద్దర్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలు వస్తే కేసీఆర్ పాంహౌస్ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. 

జనగామ, వరంగల్‌లో ప్రజా శాంతి పార్టీ ని అభివృద్ధి చేసినట్లు కేఎ.పాల్‌ తెలిపారు. చాలా మంది యువకులు తనను జనగామ, కొత్తగూడెం, ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జనగామ నుంచి పోటీచేయడానికి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజుల్లోనే లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాకు ఒక కంపెనీ పెట్టి 33 జిల్లాకు 33 లక్షల ఉద్యోగాలు ఇస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని తెలిపారు.షర్మిలను ఆహ్వానిస్తున్నాం..రాష్ట్రంలో పర్యటిస్తున్న షర్మిల తెలంగాణ ద్రోహి అని పాల్‌ విమర్శించారు. షర్మిల ఈ రోజు జీరో అవ్వడానికి రేవంత్‌ రెడ్డి కారణమని ఆరోపించారు. షర్మిల ప్రజాశాంతి పార్టీలో చేరాలని, ఆమెకు పాలేరు నుంచి టికెట్ ఇస్తానని పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనగామ నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కిరణ్, నాయకులు మోసెస్ తదితరులు పాల్గొన్నారు.