కంటి వెలుగు పరీక్షలు చేయించుకోండి కలెక్టర్ రాజర్షి షా సూచన

కంటి వెలుగు పరీక్షలు చేయించుకోండి కలెక్టర్ రాజర్షి షా సూచన

హవేలి ఘనపూర్ లో ఆకస్మిక పరిశీలన
ముద్ర ప్రతినిధి, మెదక్: అంధత్వాన్ని నివారించడానికి ఏర్పాటు చేసిన ఉచిత కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా  సూచించారు. కంటి చూపుతో బాధపడుతున్నవారు వెంటనే కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు వాడాలని, లేకుంటే చూపు సన్నగిల్లే  ప్రమాదముందన్నారు. మంగళవారం హవేళిఘనపూర్ లో కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. వైద్యులకు తగు సూచనలు చేశారు. పూర్తిగా ఉచితంగా కంటి పరీక్షలు చేస్తూ రీడింగ్ అద్దాలను వెంటనే, ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ తో  పక్షం రోజులలో  అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు.

ప్రతి శిబిరానికి రోజు కనీసం 250 మందికిపైగా వచ్చేలా ప్రజలలో అవగాహన కలిగించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ కు సూచించారు. వంద రోజుల్లో 4 లక్షల 70 వేల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంతో 40 బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1,57,253 మందిని పరీక్షించి 18,177 రీడింగ్ అద్దాలను అందించడంతో పాటు 16,964 ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశామని త్వరలో అందజేస్తామన్నారు. ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ సవిత శ్రీకాంత్, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజ్ కుమార్, కంటి వెలుగు సిబ్బంది ఉన్నారు.