గ్రామాల్లో కోతులకు రక్షణ కరువు...

గ్రామాల్లో కోతులకు రక్షణ కరువు...
  • విషం పెట్టి చంపుతున్న గుర్తు తెలియని వ్యక్తులు
  • పట్టించుకొని అటవీ శాఖ అధికారులు

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: గ్రామాల్లోని కోతులకు రక్షణ కరువైందని మూగజీవుల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టుతున్న సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చాయి. మూగ జీవులను ఇలా చంపుతున్న రక్షించవలసిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35  పైగా కోతులకు విషం పెట్టి చంపి. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఓరి దుబ్బ పల్లెలో ఇటీవల చోటుచేసుకుంది, 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామల్లో స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని వాటిని ఏం చేయలేక కొంతమంది ఇలా విషయం పెట్టి చంపుతున్నారని గ్రామస్తులు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని ప్రజలు భావిస్తున్నారు.

కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే  సర్పంచ్, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. సర్పంచ్‌, అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో మూగజీవాలను మట్టుపెట్టింది ఎవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని అటు షక పోలీస్ అధికారులు తెలిపారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలోని మూగ జీవుల మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.  మూగజీవాలకు తుది వీడ్కోలు పలికారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో కోతుల బెడద లేకుండా నివారించేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని అలాగే మూగజీవులను చంపిన వారికి గుర్తించి శిక్ష విధించాలని కూడా ప్రజలు అటవీశాఖ,  పోలీస్  అధికారులను కోరుతున్నారు.