నష్టపోయిన పంటలకు ఇన్ ఫుట్ సబ్సిడీ  -పంటలను పరిశీలించిన స్పీకర్ పోచారం

నష్టపోయిన పంటలకు ఇన్ ఫుట్ సబ్సిడీ   -పంటలను పరిశీలించిన స్పీకర్ పోచారం

బాన్సువాడ, ముద్ర: పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడానికి కృషి చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సహాయం అందిందని, ఈసారి కూడా పంట నష్టపోయిన రైతులకు తగు సహాయం అందించడానికి కృషి చేస్తానని అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్, కొయ్యగుట్ట, మొగలాన్ పల్లి లలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షం, వడగండ్ల తో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను స్పీకర్ పోచారం ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూచేతికొచ్చిన పంట నేలపాలవడం బాధాకరమన్నారు. పంట నష్టపోతే కలిగే బాధ రైతుగా తనకు తెలుసని,రెవెన్యూ, వ్యవసాయ శాఖలు వెంటనే సంయుక్తంగా సర్వే చేసి పంట నష్టంపై ప్రాధమిక అంచనాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను సేకరించి పంపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

రైతులు మనోధైర్యం కోల్పోకుండా దైర్యంగా ఉండాలని అన్నారు. కళ్ళాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు అయిన ధాన్యాన్ని వెంటనే రైసు మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు.

ప్రకృతి విపత్తు‌ను తప్పించలేమని, కానీ తప్పించుకోవచ్చని అన్నారు.

రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా, పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది నవంబర్ లో తుఫాన్లు, ఎప్రిల్ నెలలో వడగండ్లు కురుస్తాయని అన్నారు.

అందుకే యాసంగి వరి మడులను నవంబర్ లో పోసుకుని ముందస్తుగా నాట్లు వేసుకుంటే మార్చి నెలలో కోతలు పూర్తయి పంట చేతికొస్తుందని, వడగండ్లు తప్పించవచ్చని అన్నారు.

వానాకాలం కోసం రోహిణి కార్తెలోనే నార్లు పోసుకుని నాట్లు వేసుకుంటే అక్టోబర్ నెలలో కోతలు పూర్తయి నవంబర్ నెలలో సంభవించే తుఫాన్ల ముప్పు తప్పించుకోవచ్చని అన్నారు.

స్పీకర్ వెంట రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, RDO రాజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు ఉన్నారు.