సచివాలయంలో దొంగలు పడ్డారు

సచివాలయంలో దొంగలు పడ్డారు
  • చుట్టూరా భారీ భద్రత
  • అయినా రోజుకు వేల రూపాయల దొంగతనం
  • మంగళవారం ఒక్కరోజే మాయమైన స్విచ్​ బోర్డులు, ఎల్​ఈడీ లైట్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
300 సీసీ కెమెరాలు.. 600 మంది పోలీసులు, టీఎస్​ఎస్పీ పోలీసుల వలయం, లోనికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు తనిఖీలు.. ఇవన్నీ ఉన్నప్పటికీ సచివాలయంలో దొంగలు పడ్డారు. కొన్ని గదులు, విబాగాల్లో ఇంకా పనులు జరుగుతుండగా.. వాటికి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. పని చేసే కార్మికులను అణువణువునా తనిఖీ చేస్తూ పంపిస్తున్నా.. విలువైన సామాగ్రి మాత్రం మాయమవుతున్నది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి సచివాలయం సెక్యూరిటీ అధికారికి పదేపదే ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా బుధవారం కూడా సామాగ్రి మాయమైందంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధి.. సచివాలయం సెక్యూరిటీ ఆఫీసర్​కు కంప్లైంట్​ ఇచ్చారు. 

రాష్ట్ర సచివాలయానికి వెళ్లాలంటే ఐదంచెల భద్రతా వలయాన్ని దాటుకుని వెళ్లాల్సి వస్తున్నది. తెలంగాణ స్టేట్​ స్పెషల్​ పోలీస్​ బెటాలియన్​ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నది. కాగా, ఇటీవల మీడియా సెంటర్​తో పాటుగా క్యాంటిన్​ పలు ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. అక్కడ పని చేసే సిబ్బందిని తీక్షణంగా తనిఖీ చేస్తూ బయటకు, వెలుపలకు పంపిస్తున్నారు. వారి పనిముట్లను కూడా లోపలే పెడుతున్నారు. పని సమయం దాటిన తర్వాత కార్మికులు వెళ్లిపోయిన అనంతరం దొంగలు ప్రతాపం చూపిస్తున్నారు. దాదాపు ఐదుగురు దొంగలు సచివాలయంలో విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటి వరకు వేల రూపాయల విలువ చేసే కరెంట్​ వైరింగ్​ బండిల్స్​, రాడ్లు, స్విచ్​ బోర్డులు, ఎల్​ఈడీ లైట్లు  వంటి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల విలువ చేసే సామాగ్రి మాయమైంది. దీంతో పనులు చేస్తున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం మాయమైన వస్తువులపై బుధవారం నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు సచివాలయ సెక్యూరిటీ ఆఫీసర్​కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు సచివాలయంలో హాట్​ టాపిక్​గా మారింది.