తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లు: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లు: కిషన్ రెడ్డి

తెలంగాణలోని హిందువులు అందరూ ఎప్పుడో ఒకసారైనా తిరుపతి వెళ్లాలని కోరుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనే వారి  కోసం ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో పలు మౌలిక అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు.  భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ నినదిస్తూ సభికులతోనూ కేంద్ర మంత్రి పలికించారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్థిల్లాలని సభకు హాజరైన జనంతో జై కొట్టించారు. ఈ సందర్బంగా సభావేదికపై ఆసీనులైన గవర్నర్ తమిళిసై, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అనేకరకమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక నీరాజనం పలుకుతున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా మొత్తం 14 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించగా.. అందులో రెండు రైళ్లను మన తెలుగు రాష్ట్రాలకే ప్రధాని మోదీ అందించారని కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునికీకరించేందుకు రూ.714 కోట్లు కేటాయించారని వివరించారు. ఈ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఈ రోజు శంకుస్థాపన చేస్తారని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు, నిర్మాణాలకు కొద్దిసేపటి తర్వాత ప్రధాని భూమి పూజ చేస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.