తుంగతుర్తి లో వరి నాట్లు వేయడానికి ఉత్తరప్రదేశ్ కూలీల రాక

తుంగతుర్తి లో వరి నాట్లు వేయడానికి ఉత్తరప్రదేశ్ కూలీల రాక
  • తుంగతుర్తి లో వరి నాట్లు వేయడానికి ఉత్తరప్రదేశ్ కూలీల రాక
  • గతంలో తుంగతుర్తి ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి వరి నాట్ల కోసం వలస వెళ్లిన కూలీలు
  • వర్షం ఆగిపోవడంతో ముమ్మరంగా వరి నాట్లు

తుంగతుర్తి ముద్ర: గత పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పలు మండలాల్లో వరినాట్లు  ఆలస్యమయ్యాయి. గతంలో ఇప్పటికే వరి నాట్లు పూర్తయి రైతులు మొదటి దఫా ఎరువులు వేసేవారు. కానీ ఈసారి ఇంకా వరినాట్లే పూర్తి కాలేదు. గురువారం నుండి వర్షం ఆగిపోవడంతో గురువారం, శుక్రవారంలో వరినాట్లు ముమ్మరంగ సాగుతున్నాయి .తుంగతుర్తి ప్రాంతంలో ఉన్న కూలీలతో వరి నాట్లు వేయడం సాధ్యం కాదని తెలుసుకున్న రైతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలను వరి నాట్ల కోసం రప్పించారు .తుంగతుర్తి మండల కేంద్రంలో సుమారు 25 మంది ఉత్తర ప్రదేశ్ కూలీలు వరినాట్ల కోసం వచ్చారు. ఎకరాకు 5000 రూపాయల చొప్పున తీసుకుని వరి నాట్లు వేస్తున్నారు. ముఖ్యంగా మగవారు సైతం వరి నాట్లు వేయడం గమనార్హం .తెలంగాణ ప్రాంతంలో ఆడవారు మాత్రమే వరి నాట్లు వేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ కూలీలు మగవారు ,ఆడవారు కలిసి నాట్లు వేస్తున్నారు. వీరి వరి నాటు పద్ధతి డ్రం సీడర్ మాదిరిగా ఒకే లైన్లో ఉంటుంది.

ఉదయం 5 గంటల నుండి వరి నారు తీయడం తిరిగి భోజన సమయం కాగానే నాటు వేయడానికి సిద్ధమవుతారు. వరి నాట్లు ముమ్మరంగా ఉన్న ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల నుండి వరి నాట్లకు తుంగతుర్తి ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారి. గతంలో తుంగతుర్తి ప్రాంతంలో వరి నాట్లు దొరకక కూలీలు విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాలకు వరి నాట్ల కోసం కూలీలువలస వెళ్లేవారు కానీ ఒకపక్క కురుస్తున్న భారీ వర్షాలు మరోపక్క కాలేశ్వరం జలాలతో బీడు భూములన్ని సస్యశ్యామలం కావడంతో ఇతర రాష్ట్రాల నుండి కూలీలు తుంగతుర్తి ప్రాంతానికి రావాల్సి వస్తుంది. గత నెల వరకు వరి ధాన్యం కొనుగోళ్లలో అమాలీలు ఈ ప్రాంతం వారు సరిపోక చత్తీస్గడ్ ,రాజస్థాన్లో నుండి హమాలీలు రావడం జరిగింది. ప్రస్తుతం వరి నాట్ల విషయంలో రాజస్థాన్ ,ఛత్తీస్గడ్ ,ఉత్తరాఖండ్ నుండి వరి నాట్లకు కూలీలు రావడం గమనార్హం .గతంతో పోలిస్తే తుంగతుర్తి ప్రాంతం వరి ధాన్యం పండించడంలో అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు.

వర్షం ఆగిపోతే ఆగస్టు నెల పూర్తయ్యే వరకు వరి నాట్లు ముమ్మరంగా సాగవచ్చని రైతులంటున్నారు. చెరువులన్నీ వర్షం నీటితో కళకళలాడుతుండగా ఆయకట్టు పొలాలన్నీ రైతులు వరి నాటుకు సిద్ధం చేస్తున్నారు .గోదావరి  జలాలు వస్తాయన్న ఆశతో చెరువుల కింద నార్లు పోసిన రైతులకు భారీ వర్షాలతో చెరువులు నిండడం ఎంతో మేలు చేసిందని రైతులంటున్నారు .ఆలస్యమైన గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వర్షాకాలం సీజన్ వరి నాట్లు అంతే విస్తీర్ణంలో సాగుతాయని వ్యవసాయ అధికారులు, రైతులు అంటున్నారు .ఏది ఏమైనా వరి నాట్లు ఆలస్యం  కావడంతో వచ్చే రెండో పంట మరింత ఆలస్యం అవుతుందేమోనని రైతులకు కొంత మేర ఆందోళన చెందుతున్నారు .తుంగతుర్తి ప్రాంతంలో గతంలో నాట్లు వేసిన వారికి తోడు ఇతర రాష్ట్రాలకు కూలీలు కూడా రావడం వరి నాట్లు త్వరితగతిన పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు .వర్షాలు ఇంతటితో ఆగితే రైతుల ఆశలు నెరవేరుతాయి. మరి వర్షాలు ఆగుతాయా లేక మళ్ళీ కురుస్తాయా వేచి చూడాల్సిందే.