వేములవాడ నుంచి ప్రముఖుల పోటీ?

వేములవాడ నుంచి ప్రముఖుల పోటీ?
vemulawada politics

కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన ముగ్గురు నేతల పేర్లు కూడా వేములవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరగడం యాధృచ్ఛికమే అయినప్పటికీ కరీంనగర్‌, వేములవాడ లింక్‌ మాత్రం తప్పడం లేదన్న చర్చ సాగుతోంది. 2009లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్‌ 2014 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని అప్పుడు వేములవాడ నుంచే పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సెంటిమెంట్‌ గా కూడా వేములవాడ రాజన్న దర్శనానికి పొన్నం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆయన తన దృష్టి అంతా కూడా ఈ నియోజకవర్గంపై పెట్టారన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని పొన్నం పలుమార్లు చెప్పినప్పటికీ పుకార్లకు మాత్రం బ్రేకులు పడలేదు. అయితే 2014 ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగానే పోటీ చేసిన పొన్నం 2018 ఎన్నికల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహించిన బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కూడా వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఇదే సమయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు పౌరసత్వ వివాదంపై కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గులాబీ బాస్‌ ప్రత్యామ్నాయ నాయకుని కోసం అన్వేషణ మొదలు పెట్టారని రమేష్‌ బాబు స్థానాన్ని భర్తీ చేసేందుకు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పేరును పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చలు కూడా సాగాయి.

ఇదే సమయంలో బోయినపల్లి అమ్మమ్మ ఊరు కూడా ఈ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నాగారం కావడం, రమేష్‌ బాబుకు మేనబావ కావడంతో ఆయనకు వేములవాడ నుంచి అవకాశం కల్పిస్తే సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని సీఎం కేసీఆర్‌ అంచనా వేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే వినోద్‌ కుమార్‌ వేములవాడలో పర్యటించినప్పుడు తాను ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేయడంతో ఈ ప్రచారానికి తెరపడిరది.రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో సరికొత్త ప్రచారం మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేస్తారన్న చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీ బలమైన ప్రత్యర్థిగా తయారు కావడం, వచ్చే ఎన్నికల్లో కాషాయాన్ని రెపరెపలాడిరచాలన్న సంకల్పంతో బండి సంజయ్‌ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు ఇప్పటికే బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో సఫలం అయ్యారు.

ఓ వైపున పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూనే మరోవైపు పార్టీని నిర్మాణం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన బండి సంజయ్‌ ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపొందినట్టయితే సీఎం రేసులో బండి సంజయ్‌ ఉంటారని, ఈ కారణంగానే ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారంటున్నారు. ఆధ్యాత్మికతతో ముందుకు సాగే బండి సంజయ్‌ వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే బండి సంజయ్‌ కే అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందని, పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. ఈ కారణంగానే సంజయ్‌ వేములవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే సంజయ్‌ మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎంపీ గానా, ఎమ్మెల్యేగానా అనేదానిపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని తేల్చి చెప్తున్నారు. ఏది ఏమైనా గతంలో కరీంనగర్‌ ఎంపీలుగా గెల్చిన వారి పేర్లే వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా వినిపిస్తుండడం గమనార్హం.