తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలి

తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలి

చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్యకారులకే నగదు అందజేయాలి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలని, ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దళారులను తొలగించాలని, చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్యకారులకే నగదు అందజేయాలని, మత్స్య కారులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మత్స్య కారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మత్స్యకారులు కలిసి అభిమానంతో చేపలు అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుల వృత్తులు ప్రోత్సహించాలని స్వయం ప్రతిపత్తి కల్పించాలని సహకార సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలం పద్దతి రద్దు చేసి, మత్స్య కార్మికులకు చెరువులు, కుంటలపై ఆధిపత్యం కల్పించామని తెలిపారు.

చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, మత్స్య కారులు సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగానని అన్నారు. రోల్లవాగు ప్రాజెక్ట్ కు గండిపడి కోట్లాది విలువైన చేపలు కొట్టుకు  పోయాయని, వందలాది మంది మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదన్నారు. వరదలకు నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చేప పిల్లలు ఆలస్యంగా పంపిణీ చేస్తుండడంతో చేపలు పెరగడం లేదని, గిట్టుబాటు కాలేదన్నారు. చేప పిల్లలు పెంచేందుకు చెరువుల సామర్థ్యాన్ని బట్టి నగదు మత్స్యకార్మికులకే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు తోపారాపు రజనీకాంత్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు దేశవేని రాజేష్, కాంగ్రెస్ మత్స్య శాఖ విభాగం రాష్ట్ర కార్యదర్శి రుత్త నారాయణ, నాయకులు తోపారపు రవీందర్, తోకల నర్సయ్య, ప్రభాకర్, రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్, రాజేందర్, రాజేశం, శ్రీహరి, శివ, కండ్లపెల్లి రాజయ్య, భీమయ్య, కిరణ్, వెంపేట గంగాధర్ పాల్గొన్నారు.