ఎంఎల్ సి కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

ఎంఎల్ సి కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

ముద్ర సిరిసిల్ల టౌన్: ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా శాఖ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకురాలు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు హోదాలో ఉండి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో బలపడడం చూసి ఓర్వలేక ఏదో విధంగా ముఖ్యమంత్రి కె సి ఆర్ ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత పై ఈడి దాడులు చేసి నోటీసులు ఇప్పించడం చేస్తున్నారు అని అన్నారు.

ఎప్పుడు ధర్మం మతం అని చెప్పే బండి సంజయ్ ఏ ధర్మంలో ఆడవాళ్లను అవమానించేలా మాట్లాడాలని ఉందో చెప్పాలన్నారు. మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే పార్లమెంట్ సభ్యులు మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కావడం మాకెంతో సిగ్గుచేటని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మహిళలను గౌరవించాలన్న గొప్ప సంస్కృతి మన భారతదేశ సంస్కృతి అని మన ధర్మం మతం ఆది నుండి స్త్రీలను గౌరవించాలని చెబుతూనే ఉందన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారికి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.

కేసుల వల్లనో బెదిరింపుల వల్లనో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడదని రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమ స్ఫూర్తితో మరింత బలపడే నాలుగున్నర కోట్ల కుటుంబ సభ్యులు కలిగిన అతి పెద్ద కుటుంబ పార్టీ  బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, పురపాలక సంఘ వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బండి సంజయ్ యొక్క దిష్టిబొమ్మను దహనం చేసి అంబేద్కర్ చౌరస్తా నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.