హీటెక్కిన సవాళ్లపై 'నీళ్లు'..

హీటెక్కిన సవాళ్లపై 'నీళ్లు'..

- ఎక్కడికక్కడ అరెస్టులు..
- బహిరంగ చర్చలను భగ్నం చేసిన పోలీసులు..
- భూపాలపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లిలో హీటెక్కిన రాజకీయ సవాళ్లపై నీళ్లు చల్లినట్టు అయింది. జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసులు బహిరంగ చర్చలను భగ్నం చేసి, పైచేయి సాధించారు. జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలు చేస్తూ, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూకబ్జాలు చేశాడని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపణలు చేస్తూ, భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కు దమ్ముంటే రావాలని సవాలు విసిరారు. మరోవైపు గండ్ర సత్యనారాయణరావు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని, తన నిజాయితీని నిరూపించేందుకు తాను అంబేద్కర్ సెంటర్ కు వస్తానని, దమ్ముంటే చర్చకు రావాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇరువురి సవాళ్లకు భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వేదికైంది. గురువారం రోజున ఉదయం 11 గంటలకు అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ చర్చకు వెళ్లేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఇరువురు ఉద్దండులు సవాల్ గా తీసుకొని అడుగులు ముందుకు వేస్తున్న క్రమంలో పోలీసులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, బహిరంగ చర్చలకు అనుమతులు లేవని మోకాలొడ్డారు.

ఈ చర్చల విషయంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో పోలీసులు పగడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం నుండి భూపాలపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రధాన రహదారిపై పహార కాశారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ఉదయాన్నే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. భూపాలపల్లి క్యాంపు ఆఫీసును పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని బహిరంగ చర్చకు వెళ్ళనీయకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు హన్మకొండలో తన నివాసంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో జరిగే బహిరంగ చర్చకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు.

పగడ్బందీ వ్యూహంతో పోలీసులు ఇరువురు ముఖ్య నేతలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. భూపాలపల్లి లో 144 సెక్షన్ అమలు చేస్తూ, ఆయా మండలాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నాయకులతోపాటు కార్యకర్తలను అరెస్టు చేసి, అల్లర్లు జరగకుండా ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసుల చర్యలతో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు నిరుత్సాహానికి గురైనప్పటికీ, భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ చర్చ కొనసాగుతుందా, లేదా అనే ఉత్కంఠతో జిల్లావ్యాప్తంగా ఎదురుచూస్తున్న క్రమంలో పోలీసులు ఉక్కు పాదం మోపి, బహిరంగ చర్చలను భగ్నం చేశారు. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా గస్తీ తిరుగుతూ, పహారా కాశారు. దీంతో భూపాలపల్లిలో సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన రాజకీయాలకు నీళ్లు చల్లి చల్లార్చినట్లయింది.