నిద్ర మత్తులో రాష్ట్ర ప్రభుత్వం

నిద్ర మత్తులో రాష్ట్ర ప్రభుత్వం
  • దేవాదుల నీళ్లు అంద‌కుండా చేసింది కేసీఆర్‌‌ సర్కారే..
  • పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర‌ చేస్తాం..
  •  కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టుల‌ను ప‌రిశీలిస్తాం..
  • సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క 

ముద్ర ప్రతినిధి, జనగామ : కేసీఆర్‌‌ ప్రభుత్వం ఓ దున్నపోతులా నిద్రపోతుంది తప్ప ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించడంలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. వీరి తీరు వల్లే తెలంగాణలోని చాలా ప్రాంతాలకు దేవాదుల నీళ్లు అందడం లేదని ఆరోపించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఆయన కొర్రుతండా మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల, ఆత్మగౌరవం కోసం.. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు. ఆ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాడుకోవడానికి అవకాశం ఉన్న నది గోదావరి. నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని దశాబ్దాలుగా కరువు ప్రాంతాలుగా ఉన్న జనగామ ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు తీసుకురావాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖామంత్రిగా తలపెట్టిన జలయజ్ఞంలో అతిముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం. 

చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు అందించాలనుకున్నాం. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కరువుకాటకాలతో అల్లాడిపోయే ప్రజానీకానికి నీళ్లు ఇచ్చేందుకు డిజైన్‌ చేసిన గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కట్టడం కూడా పూర్తిచేసింది. అందులో భాగంగా 5 లిఫ్ట్ పాయింట్లు పెట్టడంతో పాటు అదనంగా 6 రిజర్వాయర్లను కూడా నిర్మించి అందులో నీళ్లను కూడా నింపాం. పాత చెరువులైన భీమ్ లింగాపూర్, రామప్ప, సాలివాగు, నగరం, పులిగుర్తి, ధర్మసాగర్ చెరువులు పెంచడంతో పాటు.. పైన గండిరామారం, బొమ్మకూర్, తపాస్‌పల్లి, జల్లగూడెం, చీటకోడూర్, అశ్వరావుపల్లి, ఘన్‌పూర్‌‌ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. తరువాత ఏర్పడిన టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఈ కట్టిన ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు కూడా తవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక దున్నపపోతులా నిద్రపోతోంది. కట్టిన ప్రాజెక్టులకు కాల్వలు తవ్వింటే ఈ రోజు లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చేది. 

ఇక జనగామ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముత్తిరెడ్డికి ప్రజల మీదకంటే.. ఇక్కడ భూముల మీదే ప్రేమ ఉందని.. ఉదయం నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఈ విషయం చెబుతున్నారని భట్టి అన్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం, బలవంతంగా రాయించుకోవడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం ఇది ఇక్కడి ప్రజల దురద్రుష్టం అన్నారు.  ఈ పాదయాత్ర పూర్తయిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకుని తాము కట్టిన ప్రాజెక్టులను సందర్శించేందకు బస్సు యాత్ర చేస్తామని భట్టి వెల్లడించారు.  

పీపుల్స్‌ మార్చ్‌ @ 500 కిలోమీటర్లు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారంతో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొర్రితాండా వద్ద ఏర్పాటు చేసిన బసలో భట్టి విక్రమార్కతో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.