కేంద్ర పథకాలు - రాష్ట్ర ప్రచారాలు

కేంద్ర పథకాలు - రాష్ట్ర ప్రచారాలు

 కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల 
ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేయకుండా కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంసా లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్రం పేద ప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని అన్నారు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటి పేర్లను మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే సారి కూడా బిజెపికి పట్టం కడితే మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్నారు. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు.

పశువైద్యశాలకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి రూపాల పర్యటన సందర్భంగా స్థానిక బిజెపి నేతలు రామారావు పటేల్ తదితరులు బైంసాలో పశువైద్యశాల ఏర్పాటు నిమిత్తం కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరారు. జనాభాపరంగా విశాలంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పశువైద్యశాల లేక రైతాంగం ఇబ్బందులు పడుతోందన్నారు. ఈ ప్రాంతంలో ముర్రా జాతి గేదెలు ఎక్కువగా ఉన్నాయని వీటి వైద్యం కోసం పశు వైద్యశాల ఏర్పాటు చేస్తే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్, అయ్యన్న గారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.