మేడిగడ్డ ఎగువన కాపర్ డ్యామ్

మేడిగడ్డ ఎగువన కాపర్ డ్యామ్
  • వరద మళ్లింపునకు అదే సేఫ్
  • ప్రాథమికంగా సూచించిన డ్యామ్ సేఫ్టీ బృందం 
  • 7వ  బ్లాక్ మరమ్మత్తులకు 6 నెలల సమయం 
  • పక్కన నాలుగు బ్లాకుల్లో కూడా రిపేర్ చేయాల్సిందే 

ముద్ర, తెలంగాణ బ్యూరో : లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో డ్యామ్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. ఎక్కువ వరద వస్తుందని అధికారులు పదేపదే చెప్తుండటంతో.. మేడిగడ్డ ఎగువన పోలవరం తరహాలో కాపర్ డ్యామ్ కు ప్రాథమికంగా ప్రతిపాదనలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీపై ప్రవాహ ఒత్తిడి తగ్గాలంటే సుమారు రూ. 100 కోట్లతో కాపర్ డ్యాం నిర్మించడమే పరిష్కారమంటూ సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన, ప్రాజెక్టు మ్యాప్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అనంతరం బుధవారం హైదరాబాద్ జల సౌధాలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో భేటీ అయ్యారు. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకున్నది. ఈ భేటీలో పలు కీలక సూచనలు ప్రాథమికంగా రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు చేసినట్లు తెలిసింది. కేంద్ర బృందం భేటీ ముగియడంతో గురువారం లేదా శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటుగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనున్నారు. 

చుట్టూరా ముప్పు

మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ 20వ పిల్లర్ దగ్గర వర్టికల్ క్రాక్ ఏర్పడినట్లు డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం గుర్తించింది. అయితే, ఈ ప్రభావం కేవలం ఈ ఒక్క బ్లాక్ లోనే కాకుండా ఇటువైపు 5,6వ బ్లాక్, అటువైపు 8,9 బ్లాక్ లోని పిల్లర్లపై కూడా ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించిన తర్వాత బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఉన్నతస్ధాయి  సమావేశంలో ఈ వివరాలను వెల్లడించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 15 నుంచి 21 పిల్లర్ల వరకు ఈ ప్రభావం ఉంటుందని గుర్తించడంతో.. వీటిని మరమ్మత్తులు చేయడానికి ఆరునెలల సమయం పడుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే నీటిని దారి మల్లించడానికి కాఫర్ డ్యామ్​నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. 

నివేదికలు కరెక్టేనా?

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మొత్తం బ్యారేజీలపై డీపీఆర్లు, సాంకేతిక అనుమతులు ఇలా అన్ని వివరాలను డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది. సుదీర్ఘంగా దీనిపై చర్చించారు.  రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు దీనిపై సమగ్ర వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏ విధమైన డిజైన్ ఇచ్చిందనే వివరాలను కేంద్రం బృందం సేకరించింది. సీడీఏ నివేదికల ప్రకారం నిర్మాణ కంపెనీ కూడా ఎలా పని చేసింది, పనుల్లో నాణ్యత ప్రమాణాలను అధికారుల దగ్గర నుంచి తీసుకున్నారు. అంతేకాకుండా సెంట్రల్ ఆఫ్ గ్రావిటీ తప్పిదాలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేశారు. పిల్లర్ల నిర్మాణ సమయంలో గ్రావిటీ లోతును సరిగా అంచనా వేయలేదా అను కోణాల్లో అనుమానాలు ముందుంచారు. గ్రావిటీ లోతును సరిగా అంచనా వేయలేదని, దీంతో పైపింగ్ యాక్షన్​ తో  డ్యాంమ్​కు  ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు సైతం కేంద్ర బృందం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, విస్తృత ప్రవాహాలతో ఇసుక స్పీడ్​తో కూడా పిల్లర్లకు ప్రమాదం ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు మరో కోణంలో అంచనా వేశారు.  

ప్రమాదం తప్పించడమేలా..?

ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉందని కేంద్ర బృందం అంచనా వేసింది. గత రెండేండ్ల నుంచి వరుసగా వస్తున్న వరదలు, ప్రవాహాలను సైతం పరిశీలించారు. అయితే, ఇక ముందు వచ్చే ప్రవాహాలతో కూడా ప్రమాదం ఉండే అవకాశాలున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కాపర్ డ్యాంమ్ ను కేంద్ర బృందం ప్రతిపాదిస్తున్నది. కాపర్ డ్యాంమ్ తో మేడిగడ్డ మెయిన్​ కెనాల్​దగ్గర కొంత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.  కానీ, లక్షల క్యూసెక్కుల వరద వస్తే మాత్రం కాపర్ డ్యామ్​తట్టుకుంటుందా అనే వివరాలను సైతం అంచనా వేయాలని అధికారులకు సూచించారు.  పోలవరం తరహాలోనే కాపర్ డ్యామ్​అవసరమని, భవిష్యత్తుల్లో వరదల నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తుందని అధికారుల బృందం ప్రతిపాదనలు చేసింది. 

ప్రాజెక్టు నిర్మాణాల్లో లోపాలు లేవు

బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ఇంజినీర్ల తో కేంద్ర బృందం భేటీ అయింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు, గ్రావిటీ రికార్డులు, ఇతర సాంకేతిక అంశాలపై సమీక్షించారు. ఇరిగేషన్ఈఎన్‌సీలు ముర‌ళీధ‌ర్, నాగేంద్రరావు, వెంక‌టేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధ‌ర్ రావు దేశ్‌పాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు కూడా పలు అంశాలను వివరించారు.  ఈ సంద‌ర్భంగా ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు లేవు అని వెల్లడించారు. ప్రస్తుతం ఏడో బ్లాక్‌లో సమస్య రావడం వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని, ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని వివరించారు.  ఇసుక‌ వల్ల సమస్య వచ్చిందని తాము అనుకుంటున్నామని, క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌పై అనుమతులు ఉన్నాయని, వాటిని మరోసారి పరిశీలిస్తామన్నారు. వ‌ర‌ద త‌గ్గిన త‌ర్వాత న‌వంబ‌ర్‌లో స‌మగ్ర ప‌రిశీల‌న చేప‌డుతామ‌ని ముర‌ళీధ‌ర్ పేర్కొన్నారు.  కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కీలక నివేదికలు తీసుకున్న కేంద్ర బృందం.. పరిశీలన వివరాలను ఈ రెండు రోజుల్లో కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించనున్నది.