డబుల్ బెడ్ రూమ్ హామీ ఏమైంది కేసీఆర్

డబుల్ బెడ్ రూమ్ హామీ ఏమైంది కేసీఆర్
  • 10 న చలో కలెక్టరేట్
  •   డబుల్ బెడ్ రూమ్ పోరాట సమితి కన్వీనర్ పి సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది కేసీఆర్ అంటూ బిజెపి సీనియర్ నేత, డబుల్ బెడ్ రూమ్ పోరాట సమితి కన్వీనర్ పి సుగుణాకర్ రావు ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో 27 లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు లేవని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల 72 వేల ఇళ్లకు మాత్రమే మంజూరు చేసిందని వెల్లడించారు. నిర్మాణం అయిన ఇండ్లు వేళల్లో ఉండడం కేసీఆర్ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో 24 వేల ఇళ్లు మంజూరు చేసి కేవలం 700 మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు సాధించడమే లక్ష్యంగా ఈనెల 10వ తేదీన కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు "మహాధర్నా" నిర్వహిస్తున్నామని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన రెండు లక్షల ఇళ్లులూ నిర్మించకుండా పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఇల్లు పేదవాడి గౌరవం అంటూ చెప్పిన కేసీఆర్ ఆదిశగా ప్రయత్నం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కెసిఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టకునే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లు లేని పేదలందరూ మహా ధర్నాలో  పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కన్నెబోయిన ఓదెలు, లింగంపల్లి శంకర్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, గంప జగన్, మొలుగురి కిషోర్, బేతి మహేందర్ రెడ్డి, గడ్డం నాగరాజ్, కామారపు నరహరి, దుర్గం మారుతి, నగునూరి లక్ష్మణ్, మునీర్ ఖాన్, సుజాత రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కూరగాయల తిరుపతి, కనుక చంద్రం, జితేందర్ రెడ్డి, సొన్నాకుల శ్రీనివాస్, మావురాపు సంపత్, ప్రదీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.