ఆఫీసర్లు అలర్ట్‌ గా ఉండాలి

ఆఫీసర్లు అలర్ట్‌ గా ఉండాలి
  • ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
  •  గ్రామాల్లో పరిశుభ్రత పాటించేలా చూడాలి
  • చెరువులు, కుంటల ఎప్పటికప్పుడు పరిశీలించండి
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

ముద్ర ప్రతినిధి, జనగామ: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అలెర్ట్‌ గా ఉండాని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు ఆదేశించారు. జనగామ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టరేట్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్‌‌పర్సన్‌ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి మంత్రి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వంతెనలు, రహదారులు, దెబ్బతినకుండా పంచాయతీరాజ్, రోడ్ల భవనాల శాఖ, నేషనల్ హైవే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిచంచారు. ప్రస్తుతం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు, నష్టాలు లేవని తెలిపారు. అయినప్పటికీ వాల తీవ్రత, వరదల ఉధృతిని బట్టి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి రెడీగా ఉండాలన్నారు. 

విద్యుత్ అంతరాయం, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటిస్తూ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాను తొలగించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ, బీసీ తదితర అన్ని సంక్షేమ హాస్టళ్లలో  పరిశుభ్రత పాటిస్తూ పిల్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు, భవనాలు, వంతెనలు, నష్టపోయిన పంట వివరాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. అనంతరం మంత్రి జిల్లాలోని చెంపక్ హిల్స్ లోని మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని సందర్శించి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఆయన వెంటన పలువురు జిల్లా అధికారులు, లీడర్లు ఉన్నారు.