అత్యంత వృద్ధ ఏనుగు మృతి

అత్యంత వృద్ధ ఏనుగు మృతి

అస్సాం: అతి పెద్ద వృద్ధ మగ ఏనుగు (బిజులీ ప్రసాద్) మృతి చెందింది. ఈ ఏనుగు వయసు 89 యేళ్లు. అస్సాంలోని తేయాకు తోటల్లో ఈ ఏనుగు ఉండేది. ఈ ఏనుగు వయస్సు మీదపడుతుండడంతో దాని దంతాలు ఊడిపోయాయి. దీంతో ఆహారం తినడానికి కూడా ఏనుగుకు కష్టమయ్యేది. క్రమేణా దీని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సోమవారం ఉదయం 3.30 గంటలకు ఈ ఏనుగు విలియమ్సన్ మాగోర్ గ్రూప్‌కు చెందిన తేయాకు తోటలో తుది శ్వాస విడిచింది. ఏనుగు చనిపోవడానికి వయసు సంబంధిత అనారోగ్య సమస్యలే కారణమని నిపుణులు తెలిపారు. ఈ ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు బెర్గాంగ్ టీ ఎస్టేట్‌లో ఉండేది. అక్కడి నుంచి ఏనుగు పిల్లను విలియమ్సన్ మగర్ గ్రూప్ టీ ఎస్టేట్‌కు తీసుకొచ్చారు. బెర్గాంగ్ టీ ఎస్టేట్ విక్రయించబడినందున, ఏనుగుకు మరొక టీ ఎస్టేట్‌లో వసతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏనుగు మన ప్రతిష్టకు ప్రతీక అని తేయాకు తోటల అధికారులు చెబుతున్నారు. ఈ ఏనుగుకు దంతాల సమస్య ఎదురుకావడంతో వండిన అన్నం, సోయాబీన్స్, అధిక ప్రొటీన్లు మాత్రమే తినిపించినట్లు డా. శర్మ తెలిపారు. ఈ కారణంగానే ఏనుగు జీవితకాలం మరింత పెరిగిందన్నారు. ఈ ఏనుగు మరణం బాధాకరమన్నారు.