వడగళ్ల వానతో రైతాంగానికి తీవ్ర నష్టం

వడగళ్ల వానతో రైతాంగానికి తీవ్ర నష్టం

లిక్కర్ క్వీన్ కోసం ధర్నాలు దురదృష్టకరం: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : నాలుగు రోజులుగా వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. పలు ప్రాంతాల్లో వరి పంట దెబ్బతినడం, మామిడి పూత, కాయలు రాలిపోవడం, పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయి విలపిస్తున్నారని పేర్కొన్నారు. నష్టం వాటిల్లిన ప్రాంతాలను సందర్శించి,  జరిగిన నష్టం పై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. జరిగిన నష్టం పై రూపొందించిన నివేదికను కాంగ్రెస్కు అందజేస్తే  జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్  కి అందజేసిన లేఖలో కోరడం జరిగింది.

అనంతరం చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మేడిపల్లి సత్యం, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన లక్షల మంది రైతుల గోడును పట్టించుకో వడం లేదు. నష్టపోయిన రైతులకు మనోధైర్యం కలిగించకుండా రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు,  లిక్కర్ క్వీన్ అవినీతి విచారణ వ్యవహారంపై ప్రెస్ కాన్ఫరెన్సులు, ధర్నాలు చేయడం దురదృష్టకరం అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా  అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంజాబ్, ఉత్తర ప్రదేశ్, తదితర రాష్ట్రాలలో రైతాంగం నష్టపోతే ఆ రాష్ట్రాలలో జాతీయ విపత్తు గా పరిగణించి రైతులను ఆదుకుంటున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేవలం అధికారంలోకి రావాలని, మతతత్వ విద్వేషాలు రెచ్చకొట్టే విధంగా మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.  రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోకపోతే  కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మేనెని రోహిత్ రావు  నాయకులు పురం రాజేశం, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ముద్దం తిరుపతి , ముద్దసాని రంగన్న, మహేశ్వర్ రెడ్డి, కొట్టే అశోక్, పెరుమాండ్ల గంగయ్య, రాజి రెడ్డి, దన్న సింగ్, సలీమోద్దిన్, పోరండ్ల రమేష్, పూదరి శివ, ముక్క భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.