బిజేపి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం.. 

బిజేపి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం.. 
  • కవిత మీద  కేసీఆర్ మీద కేసుపెట్టినా మాకు అభ్యంతరంలేదు..
  • అదానీ అవినీతికి ప్రధాని కొమ్ముకాస్తే మాత్రం సహించం..
  • కేంద్రప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ.. 
  • బిజేపి మోసపూరిత పాలన వివరిస్తాం.. జనాన్ని చైతన్యం చేస్తాం.. 
  • సిపియం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్:

మతతత్వ బిజేపి ని దేశంలో  అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, దానికోసం దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ సెంటర్ లో  శుక్రవారం సిపిఎం జనచైతన్య యాత్ర బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..
 కార్పోరేట్ వ్యాపారులకు కొమ్మకాస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని  పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే ఈ జనచైతన్యయాత్రను చేపట్టామని, ఇప్పటికే రెండుసార్లు కేంద్రం లో అధికారంలోకి వచ్చిన బిజెపి భారతదేశాన్ని  అన్నిరంగాల్లో నాశనం చేసిందన్నారు.  బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ ప్రభుత్వం అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా ఆడాల్సిందేనని తమ్మినేని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం మతఛాందసవాదంతో కూడుకొని ఉందని ముస్లింలు, క్రిస్టియన్లు ఇతర మతస్తులు ఎవరు ఈ దేశంలో ఉండకూడదనే స్థాయిలో వారి భావజాలం ఉంటుందని విమర్శించారు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే అధికారంలోంచి బిజెపిని గద్దెదించాల్సిందేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎవరి పైన కేసులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, నేరం చేసిన వారు శిక్షించబడతారు... కానీ సాక్షాత్తు భారత దేశ ప్రధాని  అదాని అవినీతి వ్యాపారాలకు కొమ్ము కాస్తే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. అంబానీ,ఆదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై రాజీలేని పోరాటాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సిపిఎంపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడమేనని ఆయన ప్రకటించారు. దేశాన్ని పరిపాలిస్తున్న  అర్ఎస్ఎస్  నాయకత్వంలో ఉన్న బీజేపి ప్రభుత్వం దేశంలో మత ఘర్షణలు పెంచి లబ్ది పొంది తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కుటిల ప్రయాత్నాలు చేస్తుందని తమ్మినేని ఆరోపించారు. ప్రభుత్వరంగ   పరిశ్రమలను కేంద్రం  ఆధాని, అంబానీలకు ధారాదత్తం చేస్తుందని, పేదలకిస్తున్న సంక్షేమ పథకాలకు బీజేపి ప్రభుత్వం కొర్రీలు విధిస్తుందన్నారు. మతోన్మాద బావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుందని వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కల్గిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆగడాలను సాగనివ్వద్దని పిలుపునిచ్చారు.


 ఈ సభ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు  ఈడి ని అడ్డుపెట్టుకొని మోడీ పాలన సాగిస్తున్నాడని, ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని, సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రకు తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని శంకర్ నాయక్ ప్రకటించారు ఈ బహిరంగ సభలో
  సీపీఎం నాయకులు పోతినేనిసుదర్శన్, మల్ రెడ్డి రంగారెడ్డి,
జి నాగయ్య , సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఆకుల రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి, జిల్లా సహాయ కార్యదర్శి బి అజయ్ తదితరులు పాల్గొన్నారు.