సమస్యల పరిష్కారానికి కార్మికులు ఏకమై పోరాడాలి 

సమస్యల పరిష్కారానికి కార్మికులు ఏకమై పోరాడాలి 

ముషీరాబాద్, ముద్ర:కార్మిక సమస్యల సాధనకై చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగాభారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం కార్మిక గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ఇందిరాపార్క్ వద్ద  ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్మిక గర్జన సభలో ఆచార్య హరిగోపాల్, సిపిఐఎంఎల్ ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం,  ఐ ఎఫ్ టి యురాష్ట్ర ఉపాధ్యక్షులు,  కేజీబీవీ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులు ఎస్.ఎల్. పద్మ, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిఓసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మేశ్, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ లు పాల్గొన్నరు. ఈ సందర్భంగా ఆచార్య హరిగోపాల్ మాట్లాడుతూ 9 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత 9వేల మందితో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా చేయవలసిన అగత్యం ఏర్పడిందన్నారు.

రాష్ట్ర అవతరణ సందర్భంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పదమే లేకుండా చేస్తానన్న కేసీఆర్ 3 లక్షల మందిని తెలంగాణలో కాంటాక్ట్ కార్మికులను నియమించారన్నారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారని, భద్రత లేని జీవితాలతో కార్మికులు కాలం వెల్లదీస్తున్నారన్నారు. సంపదకు మూలమైన శ్రామికులకు కార్మికులకు సంపద లేదన్నారు. దేశంలో సంపద విపరీతంగా పెరిగిపోతుందని, పెరిగిన సంపదతో కార్పొరేట్లు మరింత దోపిడీకి పూనుకుంటున్నారని అన్నారు. దేశంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. కార్మికులకు ఉండటానికి ఇల్లు వైద్యం చదువు ఉపాధి ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసమానత్వం తగ్గించడానికి పాలకవర్గాలు ఎలాంటి విధానాలు తీసుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నిటినీ తొలగించే విధానాలను అనుసరిస్తున్నారన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలన్నారు. 

సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కార్మిక వర్గ పోరాటాలను అణిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. 28 చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికులతో చెలగాటమాడుతున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలతో రైతాలకు ఉరితాడు వేసే విధంగా మోడీ వ్యవహరించారన్నారు. రైతులు సంవత్సర కాలం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారన్నారు. కార్మికులంతా ఏకమై పోరాడి నాలుగు కోడ్ లను రద్దు చేయించాలన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ రెగ్యులర్ ఉద్యోగాల రద్దు చేస్తూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పెంచుతున్నారని ఇది కార్మిక వ్యతిరేక చర్య అన్నారు. కార్మికుల సమస్యలను పక్కదారి పట్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

అనంతరం బి కృష్ణ, కె. సూర్యం మాట్లాడుతూ కాకాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, జీవోలను సవరించి కనీసం వేతనాలు ఇవ్వాలని, సవరించిన జీవోలను గెజిట్ చేయాలని, గ్రామపంచాయతీ సమ్మెను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆటో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కేజీబీవీ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులందరికీ జీవన భృతిని అందించాలని కోరారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ ఈ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఓట్ల అడిగే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఐ ఎఫ్ టి యు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు జి. రామయ్య, కె రాజన్న, సి వెంకటేష్, పి అరుణ్ కుమార్, v. కిరణ్, ప్రసాద్, యాకూబ్ షావలి,వి. ప్రవీణ్, తదితరులు ప్రసంగించారు.