అంబేద్కర్ వ్యక్తి కాదు...భారతదేశం శక్తి

అంబేద్కర్ వ్యక్తి కాదు...భారతదేశం శక్తి
  • బలహీనవర్గాలు ఏకం కావాలి
  • సంపద వికేంద్రీకరణ జరగాలి
  • మద్యం మానుకుంటేనే కుటుంబాలు బాగు
  • అంబేద్కర్ జయంతి సభలో ప్రజా గాయకురాలు విమలక్క
  • మూఢనమ్మకాలను వీడండి
  • జన విజ్ఞాన వేదిక నాయకులు బైరి నరేష్
  • దశాబ్ద కాలంగా జయంతిని నిర్వహిస్తున్న  గ్రామస్తులు
  • అభినందించిన వక్తలు 

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతిని దశాబ్ద కాలంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న గ్రామస్తులు ఐక్యతతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారధి అధ్యక్షురాలు విమలక్క, జన విజ్ఞాన వేదిక నాయకులు బైరి నరేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ... గ్రామాలలో మద్యం ఏరులై పారుతుందని, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్మును రాత్రి ఖర్చు పెట్టుతూ కుటుంబాలను పట్టించుకోవడంలేదని అన్నారు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన కుటుంబ పెద్దను ఇంట్లోకి రానీవద్దని అప్పుడే వారిలో మార్పు వస్తుందని తెలిపారు. దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉందని వికేంద్రీకరణ జరిగి తేనే దేశం అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ను కొన్ని రాజకీయ శక్తులు ఒక కులానికి పరిమితం చేస్తున్నారని... ఆయన వ్యక్తి కాదని భారత దేశపు శక్తి అని కొనియాడు . బలహీనవర్గాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది అన్నారు.

 బైరి నరేష్ మాట్లాడుతూ... గ్రామాలలో మూఢనమ్మకాలు వద్దని, కుల మతాలకు అతీతంగా మెలిగినప్పుడే వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. కులాలు పోవాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం పొందుపరిచారని గుర్తు చేశారు . అంబేద్కర్ కుల రహిత సమాజం కోసం  పాటుపడ్డాడు. చదువుతోనే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇంట్లో ఉన్న పిల్లలను ప్రతి ఒక్కరూ చదువు వైపు మళ్ళించాలని అయన సూచించారు. వ్యవసాయం చేస్తే ఏడాదికి రెండు పంటలు మాత్రమే పండించగలుగుతారని అదే చదువుకుంటే ఏ ఉద్యోగమో, వ్యాపారం చేస్తే ఏటా 12 పంటలు పండించుకునే అవకాశం ఉందని తద్వారా కుటుంబాలు కూడా మెరుగవుతాయని తెలిపారు.

ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పది ఏళ్లుగా ప్రతి ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్న గ్రామస్తులను ఆమె అభినందించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జేరుపోతుల వెంకటస్వామి,జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎస్సైలు సామల రాజేష్,దాస సుధాకర్, కొత్త తిరుపతి , వివిధ పార్టీల నాయకులు పొలోజు వెంకటేశ్వర్లు, దాసరి ప్రవీణ్ కుమార్, కొత్తపల్లి సత్యనారాయణ, కొత్త కైలాసం, బోయిని బాబు,బోయిని  వంశీకృష్ణ, రామచంద్రన్, వెంకటేశ్వర్లు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.