ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయండి - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయండి - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ

ముద్ర ప్రతినిధి,  భువనగిరి : ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి  బీద ఆర్యవైశ్యులకు మేలు చేయాలని తెలంగాణ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి  విజ్ఞప్తి  చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సుమారు 6 శాతం ఉన్న ఆర్యవైశ్యుల మాతృ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో  ప్రస్తుతం 1,80,000 మంది జీవిత సభ్యులు ఉన్నారని తెలిపారు. 117 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా  అన్ని గ్రామ, మండల, పట్టణ, జిల్లా ఆర్యవైశ్య సంఘాల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృ ద్ధికి, బీద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. అనాదిగా ఆర్యవైశ్యులు అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారని అన్నారు.

బీద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం  ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి కోరుతున్నామని అన్నారు.  తమ  కోరికను  పరిగణనలోకి తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ అంశాన్ని బీఆర్​ఎస్​ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇచ్చిందని,  కాని ఇంతవరకు
కార్యరూపం దాల్చలేదన్నారు. మరలా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున, ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వీలు కాదన్నారు.   ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్​ను  ఏర్పాటు చేసి, పెద్ద మొత్తంలో కార్పొరేషన్ కు నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయాలని కోరారు.