మెదక్ జిల్లా ఆవుసులపల్లిలో కొట్టుకుపోయిన బ్రిడ్జి

మెదక్ జిల్లా ఆవుసులపల్లిలో కొట్టుకుపోయిన బ్రిడ్జి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. మెదక్- సిద్దిపేట హైవే రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఆవుసులపల్లి శివారులో తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. మెదక్ పట్టణం బృందావన్ కాలనీ లోకి రాయన్ పల్లి కాలువ నీరు చేరడంతో జలమయమైంది.

హవెలి ఘనపూర్ మండలం గంగాపురం చెరువు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు షమ్నాపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ -కామారెడ్డి జిల్లా  సరిహద్దులో గల దూప్ సింగ్ తండా వద్ద పాత బ్రిడ్జిపై నుండి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు పాత ఇళ్లు కూలుతున్నాయి.  

మెదక్ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు వనదుర్గ ప్రాజెక్టు నుండి 5 వేల క్యూసెక్కుల నీరు దిగువ మంజీరా నదిలోకి  వెళుతుంది. రాయన్ పల్లి ప్రాజెక్టు నుండి 4500 క్యూసెక్కుల నీరు పోతున్నట్లు ఇరిగేషన్ డిఈ శివ నాగరాజు తెలిపారు. సగానికి పైగా చెరువులు మత్తళ్లు దుకుతున్నాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో  ఏడుపాయల వనదుర్గా అలయానికి తాళం వేశారు. రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.

మెదక్ పట్టణం మిలటరీ కాలనీలో భారీ వర్షానికి గోడకూలి గర్భిణీపై పడగా కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో  ఆపరేషన్ చేసి బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.