దంచి కొడుతున్న వాన..

దంచి కొడుతున్న వాన..
  • నీట మునిగిన ఇండ్లు
  • పలు గ్రామాలకు రాకపోకలు బంద్

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్ ల పరిధిలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి మత్తడి దూకుతున్నాయి. పలు గ్రామాల్లో రోడ్ల పై నుండి నీళ్ళు పారుతుండడంతో రాకపోకలు స్తంభించాయి.కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ లోని పలు కాలనీలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్ల లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం వర్ష కొండ డబ్బా, కొజన్ కొత్తూరు, యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మల్లాపూర్ మండలం సిర్పూర్ రాఘవపేట గ్రామాల మధ్య చెరువు నిండి ప్రవహించడంతో మల్లాపూర్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల పట్టణంలోని పలు కాలనీలు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోరుట్ల మండలంలోని కల్లూరు వాగు పొంగడంతో మండలంలోని ఐలాపూర్ తో పాటు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మెట్‌పల్లి పట్టణంతో పాటు మండలంలో బారి వర్షం కురవడంతో బంటుపేట, బాలకిషన్ నగర్, చైతన్య నగర్, సుల్తాన్ పుర, డిడి నగర్, టీచర్స్ కాలనీ, రబ్బానీ పుర, కాలనీలు వర్షపు నీటితో వాగులను తలపిస్తున్నాయి.

రబ్బనీ పుర, డిడి నగర్, సుల్తాన్ పుర కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్‌పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామ చెరువు పొంగి జాతీయ రహదారి 63 పై నుండి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మెట్‌పల్లి, నిజామాబాద్ పట్టణాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.మండలంలోని ఆత్మకూర్ ఆత్మ నగర్ మధ్య వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని రేగుంట చెరువు నిండి ప్రవహిస్తుండడంతో చెరువు కట్ట ఎప్పుడు తెగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.