ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిపి ఎం పోటీ చేయని స్థానాల్లో మద్దతు ఎవరికో...?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిపి ఎం పోటీ చేయని స్థానాల్లో మద్దతు ఎవరికో...?

ఆరు స్థానాల్లో పోటీకి సిపిఎం సై... మిగతా ఆరు స్థానాల్లో సిపిఎం ఓటు ఎవరికి....!

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్, సిపిఎంల మధ్య పొత్తు పొసగక పోవడంతో ఉమ్మడి నల్లగొండ
జిల్లాలో రాజకీయ సమీకరణలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇన్నాళ్లుగా
 కేంద్రంలో బిజెపిని నిలువరించడానికి, మునుగోడులో ఉపయోగించుకుని
వదిలేసిన విషయంలో బి ఆర్ ఎస్ పొత్తు పెట్టుకోకుండా ఉన్న సిపి ఎం పార్టీ
బిజెపి, బి ఆర్ ఎస్
లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ దఫా
అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీలో ఉండాలని నిర్ణయించింది. అంతేగాకుండా
కేంద్రంలో ఇండియా కూటమిలో ఉండి బిజెపిని ఓడగొట్టాలనే లక్ష్యంతో ఉన్న
సిపిఎం రాష్ట్రంలో, కేంద్రంలో స్నేహపూర్వకంగా ఉంది. దాంతో ఈ సారి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 30న జరుగనున్న నేపధ్యంలో
కాంగ్రెస్ పార్టీలో ఉభయ కమ్యూనిస్టులకు కూడా పొత్తు ఉంటుందని, గత కొన్నాళ్లుగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు చర్చలు జరిపారు. తాజాగా గురువారం
హైదరాబాదులో సిపిఎం పార్టీ సమావేశం జరిపి కాంగ్రెస్తో పొత్తు ఉండదని
ప్రకటించింది.

సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించడంతోబాటు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు స్థానాల్లో పోటీలో అభ్యర్ధులను నిలుపుతున్నట్టు
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ
జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకర్, హుజుర్ నగర్, కోదాడ, భువనగిరి
అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీలో ఉండనుంది. అయితే జిల్లాలోని ఆరు స్థానాల్లో
పోటీలో ఉంటే మిగతా ఆరు స్థానాల్లో సిపిఎం ఓటు బ్యాంక్ ఎవరిని వరిస్తుందనేది
ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట, తుంగతుర్తి,
నాగార్జునసాగర్,మునుగోడు, ఆలేరు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఉన్న సిపిఎం ఓటు బ్యాంక్ ఎవరిని వరించనుందో అన్న అంచనాలు, చర్చలు
జోరందుకున్నాయి.

 వాస్తవానికి ఈ ఆరు స్థానాల్లో సిపిఎం గెలిచే స్థితిలో లేనప్పటికీ
ఆ పార్టీకి కొద్దో, గొప్పో ఓటు బ్యాంకు ఉందనేది సుస్పష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో
ఆయా నియోజకవర్గాలో గెలిచే ఏ పార్టీకి పెద్దగా బారీ మెజార్టీలు రాకపోవచ్చనే
అంచనాలలో బాగంగా పార్టీ గెలవడానికి కొద్ది మొత్తంలో ఓట్లు కూడా ప్రభావం
చూపించడమే కాకుండా ఒక్కోసారి గెలుపు, ఓటములు నిర్ణయించే స్థితిలో
ఉంటాయని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఏతా, వాతా
చెప్పొచ్చేదేమిటంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొత్తు
పెట్టుకుంటామని తమని తక్కువ అంచనా వేసిందని, అసలు పొత్తు పేరుతో
కాలయాపన చేసి ఒక విధంగా చెప్పాలంటే మోసం చేసిందని, అలాంటి కాంగ్రెస్
పార్టీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సిపి ఎం ఓటు పడదని ఆ పార్టీ సీనియర్
నాయకుడొకరు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ విషయంలో సిపిఎం కోపంతో ఉంటుందని తెలుస్తుంది. ఎలాగూ బిజెపికి సిపిఎం
ఓటు వేయదు. ఈ పొత్తు తతంగమంతా విఫలం కావడంతో ఒక రకంగా
కాంగ్రెసుకు కూడా సిసిఎం ఓటు పడదనే తేటతెల్లమవుతుంది. ఇగ పోటీలో
ఉన్న ప్రధాన పార్టీ బి ఆర్ ఎస్, మరొక పార్టీ బి ఎస్పిలు. సిపిఎం వారు ఏ
పార్టీకి ఓటు వేస్తారో, పార్టీ ఏ లైన్ తీసుకుంటుందో కొద్దిరోజుల్లోనే పార్టీ క్యాడర్ కు
సిపిఎం నాయకత్వం దిశానిర్దేశం వీలైనంత త్వరలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆరు
నియోజకవర్గాల్లో చేయనుందని సమాచారం.