పెండింగ్ వేతనాలు చెల్లించాలని.. పంపు హౌస్ ఆపరేటర్ల ఆందోళన

పెండింగ్ వేతనాలు చెల్లించాలని.. పంపు హౌస్ ఆపరేటర్ల ఆందోళన

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంపు హౌస్ ఆపరేటర్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ పంప్ హౌస్ వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు కౌశిక్, సుభాష్, సంపత్ రాజు, రజిన్ రెడ్డి, వెంకన్న, రవీందర్, లక్ష్మణ్, మహేష్, సూరయ్య, శివరామకృష్ణ, శ్రీకాంత్ మాట్లాడుతూ బొమ్మకూరు ఇంటెక్ వెల్ నుండి బొమ్మకూర్ పంప్ హౌస్ వరకు దాదాపు 400 మంది కార్మికులు (ఆపరేటర్లు) గత 14 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. పంప్ హౌస్ ల కాంట్రాక్టర్ సకాలంలో వేతనాలు చెల్లించకుండా గత నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని అడిగితే మమ్మల్ని తొలగించి మస్థానములో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు.

దేవాదుల పంప్ హౌస్ లు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి పనిచేస్తున్న మాకు నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని పెంచిన వేతనాలతో పాటు పెండింగ్ లో ఉన్న పిఎఫ్, బీమా సౌకర్యం కల్పించాలని కార్మికుల డిమాండ్ చేశారు. పవర్ సొల్యూషన్ కాంట్రాక్టర్ ఉమామహేశ్వరరావు లిఖితపూర్వకంగా కార్మికుల రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తే మా వీధిలోని మేము సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. మా రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించకుండానే పోలీసుల రక్షణలో పంపులు ప్రారంభించే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. దాదాపు 400 మంది కార్మికులు వివిధ పంప్ హౌస్ లో పనిచేస్తున్నారని వాళ్లందరికీ న్యాయం చేకూర్చాలని చలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.