ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి

ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి

 జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముద్ర ప్రతినిధి

మెదక్: రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శని, అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు, డిఆర్ఓ పద్మశ్రీ తో కలిసి పంచాయత్ రాజ్, పోలీస్, రెవిన్యూ అధికారులతో వచ్చే శాసనసభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ 576 కేంద్రాలు ఉన్నాయని, 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ అధికారిని నియమిస్తామన్నారు. పట్టణాలలో 1500 ఓటర్లు, గ్రామీణ ప్రాంతాలలో 1400 ఓటర్ల కన్నా ఎక్కువ ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌళిక సదుపాయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయత్ రాజ్, నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బి.ఎల్ .ఓలు , బిఎల్ఏలు ఇంటింటి సర్వేలో ఫారమ్ 6, 7, 8, నమోదు వేగంగా చేయాలన్నారు.

జిల్లాలో 18-19, 20-29 వయస్సుగల ఓటర్ల నమోదు, వికలాంగుల ఓటర్ నమోదు వేగవంతం చేయాలన్నారు. ఇతర జిల్లాలోని వివిధ కళాశాలలలొ విద్యనభ్యసిస్తున్న డిగ్రీ, ఎల్ఎల్బి, ఐటిఐ, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు వారివివరాలు సేకరించి కళాశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పటిచేసి ఓటర్ నమోదు చేయించాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థలు కవరయ్యేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాలలో, గ్రామాలలో ప్రత్యేక ఓటర్ నమోదుకు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎస్.పి రోహిణి ప్రియదర్శని మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి,ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రాంతాలను ముందుగా గుర్తించడానికి మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు తహసీల్దార్లు సమన్వయంతో పోలింగ్ స్టేషన్ లను పరిశీలించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించాలని తెలిపారు. డిఆర్ఓ పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా అధికారులు, పోలీస్, తహసీల్దార్లు, ఎంపిడిఓలు జిల్లాలో ప్రతి గ్రామాలో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతినెలా ఒక గ్రామంలో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.