సామాజిక సేవలో ముందడుగు

సామాజిక సేవలో ముందడుగు
  • శ్రీరామానుజ మందిరం ఆధ్వర్యంలో పేద మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ
  • మహిళల్లో ఆర్థికాభివృద్ధికి కృషి
  • సెట్విన్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ

 హైదరాబాద్, ముద్ర ప్రతినిధి: పేద మహిళల ఆర్థికాభివృద్ధికి సికింద్రాబాద్ మౌలాలి ప్రాంతంలో భగవత్ శ్రీరామానుజ సేవా ట్రస్టు కృషి చేస్తున్న విషయం తెలిసింది. సంస్థ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యకలాపాల వేదికగా శ్రీరామానుజ సేవా మందిరాన్ని  నిర్మించి, పలు ఆధ్యాత్మిక, విద్యా, వైద్య సేవలు అందిస్తుంది. రామానుజ మందిరంలో గణనీయమైన సంఖ్యలో  పేద మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కలంకారీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో  ఈ యేడాది ఉచిత శిక్షణా తరగతులను నిర్వహించింది. ప్రభుత్వ స్వయం ఉపాధి కల్పనా సంస్థ సెట్విన్ నియమ నిబంధనలకు అనుగుణంగా శిక్షణా తరగతులను నిర్వహించినందున దీనిని సెట్విన్ సంస్థ అధికారులు గుర్తించి, శిక్షణ పొందిన మహిళలకు తమ స్వీయ పర్యవేక్షణలోనే అర్హత పరీక్షలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీరామానుజ సేవా ట్రస్టు అధ్యక్షుడు, రామానుజ మందిర నిర్వాహకులు డాక్టర్ ధనుంజయ మాట్లాడుతూ.. తాము ఇంత వరకూ నిర్వహించిన ఆధ్యాత్మిక, విద్య, వైద్య సేవా కార్యకలాపాలలో ఇప్పడు పేద మహిళలకు అందించిన ఉచిత స్వయం ఉపాధి శిక్షణా శిబిరం ప్రత్యేకమైనదని అభివర్ణించారు. ఇంటిలో గృహిణి విద్యావంతురాలైనా, సంపాదనపరురాలైనా ఆ కుటుంబ జీవనానికి కొండంత అండగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.  

అందరికీ ఉపయోగపడేలా సామాజిక ప్రయోజనం కోసం ఓ సంపూర్ణ సామాజిక వేదికగా నిలవాలన్న ఆశయంతో రామానుజ మందిరం నిర్మించామని ఆయన తెలిపారు. సంస్థ ఏర్పడిన ఆరంభ కాలంలో అనేక బాలారిష్టాలను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అయితే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు అందించిన ఆత్మీయ తోడ్పాటుతో తమ సంస్థ సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని ఆయన వివరించారు. ఆధ్యాత్మిక దృక్పథంతో ప్రారంభించిన ఈ సేవా సంస్థ ఆ రంగనాథుడి, బృహదాంజనేయుని అనుగ్రహంతో భవిష్యత్​లో విశేష రీతిలో సేవా ప్రస్తానం సాగించగలదని ధనుంజయ ఆకాంక్షించారు.