ఆదిలోనే హంసపాదు..

ఆదిలోనే హంసపాదు..
  • ముందుకు కదలని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు..
  • అడుగడుగునా అడ్డంకులు..
  • పరిహారం చెల్లింపులో కొలిక్కి రాని సమస్య..
  • సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్న బాధిత రైతులు..
  • నాలుగేళ్లుగా సమస్యను చక్కదిద్దని ఆఫీసర్లు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:వరంగల్ నుంచి మంచిర్యాల వరకు నిర్వహించనున్న నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు పడుతుంది. అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతూ, పనులు ముందుకు కదలడం లేదు. భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపు విషయం కొలిక్కి రాకపోవడంతో గత నాలుగేళ్లుగా రోడ్డు నిర్మాణ పనుల్లో కదలిక లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణానికి గాను సర్వేకు వస్తున్న అధికారులను రైతులు అడ్డుకుంటున్నారు. రైతుల భూములకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అతి తక్కువ పరిహారం తమకు వద్దంటూ తమ భూముల్లో సర్వే చేయొద్దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి గాను ఆయా జిల్లాలో  భూసేకరణపై ఆఫీసర్లు 2019లో కసరత్తు ప్రారంభించారు. వరంగల్ నుంచి మంచిర్యాల వరకు మొత్తం 112 కిలోమీటర్లకు గాను మంచిర్యాల జిల్లాలో 25.5 కి.మీ., పెద్దపల్లి జిల్లాలో 38కి.మీ., జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24.6 కి.మీ., వరంగల్ జిల్లాలో 23.8 కి.మీ. మేర భూమిని గుర్తించాలని అప్పట్లో ఆఫీసర్లు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని 14 గ్రామాల్లో 24.6 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉండగా గత నాలుగేళ్లుగా  సర్వే పనులు చేస్తూనే ఉన్నారు. 

  • ముందుకు సాగని పనులు..

వరంగల్ నుండి మంచిర్యాల వరకు నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు సర్వే పనులు ముందుకు సాగడం లేదు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారంపై స్పష్టత లేకుండానే పొలాల్లో సర్వేలు చేసి, స్తంభాలు పాతడంపై రైతులు మండిపడుతున్నారు. ఎకరానికి రూ.40 లక్షలు చెల్లించాలని, ప్రత్యామ్నాయంగా భూమి కేటాయిం చాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటికో ఉద్యోగం కావాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ సమస్య కొలిక్కి రాకుండానే అధికారులు సర్వేకు వస్తుండడంతో రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో సర్వే చేసేందుకు వచ్చిన నలుగురు అధికారులను బాధిత రైతులు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే చేయనీయకుండా అడ్డుకుని అధికారులను వెనక్కి పంపించేశారు. 

  • రోడ్డు నిర్మాణం జరిగితే తగ్గనున్న దూరభారం..

వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలంటే, పరకాల, భూపాలపల్లి, మంథని, గోదావరిఖని మీదుగా 150 కి.మీ. ప్రయాణించాల్సి వస్తుంది. కొత్త హైవే నిర్మాణం వల్ల దాదాపు 30 కి.మీ. వరకు దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం సర్వే చేస్తున్న హైవే వరంగల్ జిల్లా దామెర మండల శివారు రింగ్ రోడ్డు నుంచి శాయంపేట, పరకాల మండలాల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల వరకు వెళ్తుంది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా ముత్తారం, మంథని గుండా మంచిర్యాల సమీపంలోని జైపూర్ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మించనున్నారు.

  • కేంద్రం నిధులతో జాతీయ రహదారులు.. 

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వరంగల్ నుంచి మంచిర్యాల వరకు నాలుగు లైన్ల హైవే రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. భూసేకరణ కోసం సుమారు నాలుగేళ్ల క్రితం గెజిట్ ను విడుదల చేసింది. ఆ గెజిట్లో పేర్కొన్న రోడ్ మ్యాపు అనుసరించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు భూసేకరణ సర్వే పనులు చేపట్టారు. ఇందుకోసం అప్పట్లో గ్రామసభలు నిర్వహించారు. మొగుళ్లపల్లి మండలంలో 8.78 కిలోమీటర్లు, చిట్యాల మండలంలో 6.85 కిలోమీటర్లు, టేకుమట్ల మండలంలో 9 కి లోమీటర్ల వరకు భూమి అవసరం ఉందని ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు సర్వే నంబర్ల వారీగా పట్టాదారులను గుర్తించి నోటిఫికేషన్ కూడా జారీచేశారు. రైతులకు మార్కెట్ ధర చెల్లించక పోవడంతో పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.