17న పాలిసెట్​

17న పాలిసెట్​
  • మెదక్​ జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు
  • నిమిషం ఆలస్యమైనా అనుమతివ్వరు
  • మెదక్​ జిల్లా కో–ఆర్డినేటర్​ డా.సువర్ణలత

ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్రంలోని ప్రభుత్వ. ప్రైవేట్ పాలిటెక్నిక్​లలోని మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం ఈనెల 17న పాలిటెక్నిక్​ (పాలిసెట్)-2023 పరీక్షను నిర్వహించనున్నట్లు మెదక్​ జిల్లా కో–ఆర్డినేటర్​, మెదక్​ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్​ సువర్ణలత తెలిపారు. ఈనెల 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాల్లో 1, 933 మంది విద్యార్థులు హాజరవుతారని సువర్ణలత తెలిపారు.

ఈ పరీక్షలు మెదక్​ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్​ హైస్కూల్​, గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ హౌసింగ్​ బోర్డు కాలనీ,  సిద్దార్థ్​  ఆదర్శ్​ జూనియర్​ కాలేజీ, గీతా జూనియర్​ కాలేజీ, సిద్దార్థ్​ మోడల్​ హైస్కూళ్ళలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డాక్టర్​ సువర్ణలత వివరించారు. ఈ పరీక్షకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే ఉదయం 10 గంటలకే అనుమతిస్తారని, విద్యార్థులు అప్పటికే తమ సెంటర్లకు చేరుకొని ఓఎమ్​ఆర్​ షీట్​లో రెండువైపులా పూర్తి వివరాలతో సంతకం చేయాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ వెంట హెచ్​బీ, 2 బీ బ్లాక్​ పెన్సిల్​, ఎరేసర్​, బ్లూ, బ్లాక్​ పెన్నులు తప్పక తీసుకురావాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్ మీద ఫొటో రానట్లయితే వారు ఒక పాస్​పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవన్నారు.