బయ్యారంలో నకిలీ నక్సలైట్ లు అరెస్ట్

బయ్యారంలో నకిలీ నక్సలైట్ లు అరెస్ట్
  • రూ 1.20 లక్షల నగదు,ఎయిర్ పిస్టల్ స్వాధీనం
  • నాలుగు సెల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మావోయిస్టుల పేరుతో కిడ్నాప్, డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సలైట్లను బయ్యారం పోలీసులు, సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ లో గురువారం డిఎస్పి రమణబాబు  నకిలీనక్సలైట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాకు చెందిన కొల్లి యాదగిరి రెడ్డి అనే పాత ఇనుపసామాన్ల వ్యాపారి బయ్యారం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక పోలీసు బృందంతో దర్యాప్తు ప్రారంభించారు.  గతంలో  ప్రజాప్రతిఘటన దళకమాండర్ గా పనిచేసిన ఉప్పునూతల ముత్తయ్య మరో ముగ్గురుతో కలిసి మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేద్దామని నిర్ణయించుకున్నాడు.  బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పరిధిలో గల తన వ్యవసాయ పొలం వద్దకు ఇల్లందు నుండి కొల్లి యాదగిరిరెడ్డి అనే వ్యాపారీ వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చి పోతుండడాన్ని గమనించి అతనిని లక్ష్యంగా ఎంచుకున్నారు. యాదగగిరిరెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేయవచ్చని పథకం రూపొందించారు. 15 రోజులుగా అతని పొలం వద్ద వేచి చూస్తూ రెక్కి నిర్వహించారు. డిసెంబర్ 12వ తేదీ 2022 సంవత్సరం మధ్యాహ్నం సమయంలో పొలం వద్దకు వచ్చిన యాదగిరిడ్డిని తమ వెంట తెచ్చుకున్న ఎయిర్ పిస్టల్ తో నలుగురు వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేసి నక్కలగుట వైపుకు తీసుకెళ్లారు. అక్కడి నుండి వాళ్ళు తెచ్చుకున్న డీలక్స్ బైక్ పై చింతోని గుంపు అటవీ ప్రాంతం వైపు తీసుకువెళ్లి, మమ్మల్ని మావోయిస్టునేత హరిభూషణ్ పంపించాడని 20 లక్షలరూపాయలు చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరిభూషణ్ చనిపోయాడు కదా.. అని యాదగిరి రెడ్డి ప్రశ్నించారు. మాకే ఎదురు చెప్తావు అంటూ అతనిని కొట్టి పిస్టల్ తో కాల్చివేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన యాదగిరిరెడ్డి లక్ష 25 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఫోన్ చేసి, ఇటుక బట్టి వాళ్లకు లక్ష 25 వేల రూపాయలు ఇవ్వాలని కొత్తపేట రావి వెంకటరావు ఇటుకబట్టి వద్దకు డబ్బులు తీసుకుని  రమ్మని చెప్పాడు. అదే రోజు సాయంత్రం ఆ డబ్బులను సదరు వ్యక్తులకు అందజేశారు. డబ్బులు తీసుకున్న ఆ..నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వెళ్తూ ఎవరికైనా విషయం చెప్పావా చంపుతామని బెదిరించారు.  పోలీసులకు జరిగిన సంఘటనను యాదగిరిరెడ్డి వివరించడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. బయ్యారం వద్ద గురువారం వాహనాల తనిఖీ చేస్తుండగా  అనుమానాస్పద స్థితిలో రెండు బైకులపై నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. గతంలో ప్రజాప్రతిఘటన దళ కమాండర్ గా పాల్వంచ మణుగూరు ఏరియాలో పనిచేసి ప్రస్తుతం సీతారాంపురంలో వ్యవసాయం చేసుకుంటున్న ఉప్పునూతల ముత్తయ్య అలియాస్ ఆజాద్, మాజీ ప్రజా ప్రతిఘటన సభ్యుడు బయ్యారంకు చెందిన తాపీమేస్త్రి పసుల లింగయ్య, ఖమ్మం పట్టణంలోని బల్లేపల్లి బీసీ కాలనీకి చెందిన తాపీ మేస్త్రి బత్తుల రామకృష్ణ, మాజీ ప్రజా ప్రతిఘటన లీగల్ ఆర్గనైజర్ ప్రస్తుతం బయ్యారంలో మటన్ షాప్ నడుపుతున్న నిమ్మల లింగయ్య నలుగురు ముఠాగా ఏర్పడి కిడ్నాప్ డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు డిఎస్పి రమణబాబు తెలిపారు. యాదగిరిరెడ్డిని బెదిరించి, కిడ్నాప్ చేసి, వీరు నలుగురు లక్షాఇరవైఐదువేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరి నుండి రూ.1,25,000 నగదుతో పాటు ఒక ఎయిర్ ఫిస్టల్, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా పనిచేసిన మహబూబాబాద్ సిసిఎస్, టెక్నికల్ టీం, బయ్యారం పోలీసులను ఈ సందర్భంగా మహబూబాబాద్ డిఎస్పీ రమణబాబు  అభినందించారు