అధికారంలోకి వస్తే ఇండ్లు కట్టిస్తాం: షర్మిల హామీ

అధికారంలోకి వస్తే ఇండ్లు కట్టిస్తాం: షర్మిల హామీ
Arrest of prostitution operators under the guise of spa
  • నెల్లుట్లలో గుడిసెవాసులకు షర్మిల హామీ
  • ఉత్సహంగా సాగుతున్న ప్రజా ప్రస్థానం యాత్ర

 ముద్ర ప్రతినిధి, జనగామ: తాము అధికారంలోకి వస్తే గుడిసెవాసులకు పక్కా ఇండ్లు కట్టిస్తామని వైఎస్సార్‌‌ టీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా జనగామ నుంచి పాలకుర్తి వెళ్తున్న ఆమెను నెల్లుట్లలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న కుటుంబాలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంట్, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న వారిని చూసి షర్మిల చలించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌‌కు ప్రభుత్వ భూములను అమ్ముకునే విషయంలో ఉన్న శ్రద్ధ.. ఇళ్లు లేని పేదలకు పట్టాలు ఇవ్వడంలో లేదని వివమర్శించారు. 

వైఎస్సార్‌‌ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే.. గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఎలా జీవనం సాగిస్తారన్న ఆలోచనతో వెంటనే ఈ కాలనీకి రూ.15 లక్షల ఖర్చుతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు చర్యలు చేపట్టాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. అక్కడి నుంచి లింగాలఘనపురం మండలం పటేల్‌గూడెం, కుందారం, కిష్టగూడెం, చీటూరు మీదుగా కోలుకొండకు చేరుకున్నారు.

మాటా ముచ్చటలో మంత్రిపై విమర్శలు..
కోలుకొండలో నిర్వహించిన మాటా ముచ్చటలో షర్మిల మంత్రి దయాకర్‌‌రావుపై విమర్శలు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన తన నియోజవర్గానికి చేసిందేమీ లేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఇచ్చాడని ప్రశ్నించారు. పంచాయతీలు నడపడానికి ఖాళీగా ఉన్న బ్రాందీ బాటిళ్లు అమ్ముకోమని చెప్పిన మంత్రి ఈయనే అంటూ విమర్శించారు. అనంతరం అక్కడి నుంచి పాలకుర్తికి బయలు దేరి వెళ్లారు.