అనాథలకు ‘అమ్మ’ చేయూత-తల్లీ ఇద్దరు పిల్లలను సఖి కేంద్రం తరలింపు

అనాథలకు ‘అమ్మ’ చేయూత-తల్లీ ఇద్దరు పిల్లలను సఖి కేంద్రం తరలింపు

ముద్ర ప్రతినిధి, జనగామ: దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీపిల్లలకు జనగామకు చెందిన అమ్మ ఫౌండేషన్ చేయూతను అందించింది. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్‌లో ప్రసన్న (27) ఇద్దరు కుమారులు ఆకాశ్‌(9), మనీ (7) దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్నారు. వారిని గమనించిన స్థానిక ఆటో డ్రైవర్ మల్లేశ్‌ అమ్మ ఫౌండేషన్కు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ బృందం ఆహారాన్ని అందించి ధైర్యం చెప్పి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రకు చెందిన ఆమె 10 ఏళ్ల కింద లతీఫ్‌ అనే ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. వారు కొద్ది రోజులు హైదరాబాద్‌ లో నివాసం ఉన్నారు. నాలుగు నెలల కింద జిల్లాలోని పాలకుర్తికి వచ్చి కూలీ పనులు చేసుకుని జీవనం సాగించారు. అయితే లతీఫ్‌ భార్య వద్ద ఉన్న తనకు సంబంధించిన అన్ని వివరాలను డెలిట్‌ చేసి పిల్లలతో సహా ఆమెను జనగామలో వదిలేసి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని అమ్మ పౌండేషన్‌ వారు చేరదీసి జనగామ సఖి కేంద్రంలో అప్పగించారు. కాగా, లతీఫ్‌ ఫోన్‌ ప్రస్తుతం స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని, ఆయన ఆచూకీ కోసం తాము విచారణ చేపడుతామని కేంద్రం కౌన్సిలర్‌‌ రాధిక పేర్కొన్నారు. మణి వెంట గండి నాగరాజు, పండుగ నరేశ్‌, బింగి నరసింహులు ఉన్నారు.